● గుట్టుచప్పుడు కాకుండా నీరు పారబోత
ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని డీఆర్‌ఎస్ గోదాం వద్ద భారీగా నిల్వ ఉన్న గడువు ముగిసిన మినరల్ వాటర్ బాటిళ్లు మంగళవారం బయటపడ్డాయి. సుమారు 300 కాటన్లకు పైగా ఉన్న ఓ కంపెనీకి చెందిన బాటిళ్లను కొంత మంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారుల పర్యవేక్షణ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై కొందరు విలేకరులు అక్కడికి చేరుకోగానే బాటిళ్లను ఖాళీ చేస్తున్న వ్యక్తులు జారుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మేడారం జాతర కోసం భారీ స్థాయిలో వాటర్ బాటిళ్ల తెప్పించినట్లు సమాచారం. అయితే జాతర సమయంలో భక్తులకు వీటిని పంపిణీ చేయకుండా గోదాముల్లోనే నిల్వ చేయడంతో కాలక్రమేణా గడువు ముగిసింది. ప్రభుత్వం ప్రజాధనంతో కొనుగోలు చేసిన వేలాది బాటిళ్లు వృథా కావడం.. ఇప్పుడు వాటిని రహస్యంగా పారబోయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ అంశంపై గోదాం ఇన్‌చార్జ్ సహా సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
నిబంధనలు గాలికి..
నిబంధనల ప్రకారం గడువు ముగిసిన వస్తువులను డిస్పోజ్ చేయాలంటే ముందుగా స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించాలి. అనంతరం ఉన్నతాధికారుల నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి పొందాలి. మొత్తం ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి ప్లాస్టిక్ బాటిళ్లను రిసైక్లింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలేమీ అమలు చేయకుండానే నీటిని పారబోసి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ దుర్వినియోగానికి కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


