● రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
హన్మకొండ అర్బన్: దివ్యాంగుల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో మహిళా అభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు చెందిన 94 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఇంత విస్తృత స్థాయిలో ఉపకరణాల పంపిణీ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు. దివ్యాంగులకు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు, విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక రాయితీలు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యం, వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


