మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాలో విఫలమవ్వడం, మౌలిక సదుపాయాలు, పైపులైన్ల పనులు పూర్తి కాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల ప్రజలు వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీరు..
బయ్యారం, గార్ల, మానుకోట, డోర్నకల్ పలు మండలాలు మీదుగా మూన్నేరువాగు ప్రవహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అమృత్ జల్ పథకం పనులు జరుగుతున్న నేపథ్యంలో పాత పైపులైన్లు పగలడంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డోర్నకల్‌లోని పలు వార్డుల్లో తాగునీరు అందడం లేదు. నీటి కోస అక్కడి ప్రజల అలమటిస్తున్నారు. అలాగే మానుకోట మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీర్చేందుకు పలువురు కౌన్సిలర్లు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు.
తాగునీటి చర్యలు ఇలా..
జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వేసవిలో ప్రజలు తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణతో జిల్లాలో పలు మండలాలు, పలు గ్రామ పంచాయతీల్లో సమస్యలను గుర్తించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. చేతి పంపులు, నల్లా కనెక్షన్లు, పైపులైన్, తాగునీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు సంపుల పనులు పూర్తి చేసి నీరందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ అధికారులు సిబ్బందితో మరమ్మతులు చేపిస్తూ ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రారంభం కాని వాటర్ ట్యాంకు..
జిల్లా కేంద్రం కొత్తబజారులోని కంకరబోర్డులో రూ.3కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ అధికారులు వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. పనులు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. విద్యుత్ సరఫరా అందించి చిన్న చిన్న పనులు పూర్తి చేసి మున్సిపల్‌కు అప్పగిస్తే తాగునీటి ఇబ్బందులు తప్పుతాయని స్థానికులు అంటున్నారు. అదేవిధంగా పాత బజారులో ఉన్న పలు వార్డులకు తాగు నీరు అందించడంలో మున్సిపల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయ పాలన పాటించకుండా 20 నుంచి 40 నిమిషాల వరకు నీటిని విడుదల చేయడంతో ప్రజల అవసరాలకు పూర్తి స్థాయిలో మంచినీరు అందడంలేదు. రెండు రోజులకోసారి మంచినీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బోర్లు వేసుకునే వారు అనుమతులు తీసుకోవాలి..
రైతులు, గృహవసరాలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అనుమతులు తీసుకొని, సర్వే చేసుకొని బోర్లు వేయించుకోవాలి. ఎక్కడపడితే అక్కడ బోర్లు వేస్తే బండలు వచ్చి ఆర్థికంగా నష్టపొతారు. పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు పొల్లాలో, ప్రజలు ఇళ్లలో తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. భూగర్భ జలాలను పెంచుకోవాలి.
– అశోక్, జిల్లా భూగర్భజలశాఖ అధికారి
మానుకోట 25వ వార్డులో ట్యాంకర్‌తో మంచినీటిని అందిస్తున్న నర్రా సంధ్యశ్రావణ్
నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభానికి నోచుకోని వాటర్ ట్యాంక్


