మహబూబాబాద్ రూరల్: పోలీసులు ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని నేరాల నియంత్రణలో ముందుండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పరిధిలోని సబ్ డివిజన్ అధికారులు, సీఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సంబంధిత విభాగాల అధికారులతో సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రస్తుత నేర స్థితిగతులు, పెండింగ్ కేసుల పరిష్కారం, విచారణల పురోగతి, లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై సమీక్షించి, ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి, నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. మన ఊరు–మన బాధ్యత కార్యక్రమం అమలుపై ప్రత్యేకంగా ఆరాతీసి, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, యువతలో మార్పు తీసుకువచ్చే అవగాహన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం పెంపు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించాలని, ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించాలన్నారు. వివిధ కేసుల్లో శిక్షలు పడటడంలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి సంబంధిత సీడీఓలకు రివార్డులు అందజేశారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్యను శాలువాతో సన్మానించి మెమెంటో అందించారు. జిల్లా పోలీసు వాహనాలపై ప్రత్యేకంగా పరిశీలన నిర్వహించి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి వాటి స్థితిగతులు, వాహనాలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాహనాలను ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంచి, సమయానికి మెయింటెనెన్స్ చేయాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఎస్పీ శబరీష్


