ఇనుగుర్తి: మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు సెంటర్‌లో పది రోజుల నుంచి రైతులకు గన్నీ సంచులు ఇవ్వడం లేదని, నింపిన బస్తాలను కాంటాలు పెట్టి తరలించడం లేదని సోమవారం సీపీఎం, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు రైతులతో కలిసి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కరుణాకర్ అక్కడికి చేరుకొని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు విన్నవించుకోవాలని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమించారు. అనంతరం తహసీల్దార్ కార్యలయం ఎదుట ధర్నా చేసి, మక్క రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మార్తినేని పాపారావు, మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, బీఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ రెడ్డి, బేతమల్ల చంద్రయ్య, గండు నాగన్న, పెండ్లి మహేందర్, బండి సత్యం, రాజన్న, దర్గయ్య, సంజీవ రెడ్డి, యాకయ్య, లచ్చు, రైతులు పాల్గొన్నారు.


