మేకలను మేపడానికి వెళ్లి మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

మేకలను మేపడానికి వెళ్లి మృత్యుఒడికి..

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

బావిలో పడి విద్యార్థి మృతి

నర్సింహులపేట: మేకలను మేపడానికి వెళ్లిన ఓ ఇంటర్మీడియెట్‌ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. వంతడపల శివారు తండాకు చెందిన బానోత్‌ రవి, అరుణ దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు హర్షవర్ధన్‌(18) ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తి కాగానే ఇంటి వద్ద ఉంటున్న తాత రాములు, నానమ్మ దస్మా వద్దకు వచ్చాడు. తాత, నానమ్మ గ్రామంలో మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎండ తీవ్రంగా ఉండడంతో తాత, నానమ్మను ఇంటి వద్దే ఉంచి హర్షవర్ధన్‌ మేకలను తీసుకుని ఒక్కడే వెళ్లాడు. గ్రామ శివారులో మేపుతున్న క్రమంలో మేకలు బావి ధరి వద్దకు వెళ్లాయి. హర్షవర్ధన్‌ వాటిని కొట్టే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. ఈత రాక మునిగిపోయాడు. దీనిని చూసిన పక్కన ఉన్న హేము అనే వ్యక్తి బావిలో దూకి కాపాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే హర్షవర్ధన్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకులు, తండావాసులు గుండెలవిసేలా రోదించారు. హర్షవర్ధన్‌ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బ్యాంకును మోసం చేశారు..

మేనేజర్‌ ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు

రామన్నపేట : బ్యాంకు కంప్యూటర్‌ సిస్టమ్‌లో నెట్‌ వర్క్‌ సమస్య, సాంకేతిక లోపం, క్యాషియర్‌ పొరపాటు కారణంతో బ్యాంకు సొమ్ము ను తప్పుడు పద్ధతిలో డ్రా చేసిన నిందితులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు. వరంగల్‌ పోచమ్మమైదాన్‌ ఎస్‌బీఐ మేనేజర్‌గా కొలిపాక సంతోష్‌ పనిచేస్తున్నారు. గతేడాది నవంబర్‌ 11న పరకాల మండలం పులిగిల్లకు చెందిన దయ్యాల శైలజ, విష్ణు దంపతులకు రూ.1,49,000 గోల్డ్‌ లోన్‌ మంజూరైంది. ఆ రుణానికి సంబంధించిఈ ఏడాది ఫిబ్రవరి 3న గోల్డ్‌ లోన్‌ ఖాతా మూసివేత కోసం శైలజ, విష్ణు దంపతులు బ్యాంకుకు వచ్చారు. సి బ్బంది సిస్టమ్‌లో క్లోజర్‌ ప్రక్రియ ప్రారంభించారు. అయితే నెట్‌వర్క్‌ సమస్య, సాంకేతిక లోపంతో లోన్‌ ఖాతా మూసివేయలేకపోయారు. కానీ క్యాషియర్‌ రాజీ పొరపాటున బంగారు ఆభరణాలను శైలజ, విష్ణు దంపతులతోపాటు మరో మహిళ రాధకు అప్పగించారు. కానీ అప్పటికే లోన్‌ ముగింపునకు ఉంచిన సొమ్ము మొత్తాన్ని ఖాతాలోనే ఉంచారు. ఫిబ్రవరి 4న యూపీఐ, ఏటీఎం లావాదేవీల ద్వారా ఆ సొ మ్మును ఉపసంహరించుకున్నారు. ఈ విషయమై బ్యాంకు అధికారులు వారిని సంప్రదించగా మొదట డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించారు. తర్వాత విష్ణు తప్పును అంగీకరించి కొంత సమయం కో రి నా ఇప్పటి వరకూ బకాయి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో శైలజ, విష్ణుదంపతులతోపాటు మరో మహిళ దయ్యాల రాధపై మేనేజర్‌ సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement