ఖిలా వరంగల్: ఫర్టిలైజర్ డీలర్ల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ‘ది తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఎరువుల కంపెనీలు మార్క్‌ఫెడ్‌కు ఎఫ్‌ఓఎల్ ఇచ్చి డీలర్లకు ఇవ్వకపోవడం, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల విక్రయాల్లో లింక్ ప్రొడక్టస్ అంటగట్టి డీలర్లకు ఆర్థిక భారం వేసే కంపె నీలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్ల సమస్య సాధన కోసం ఆలిండియా, ది తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్,ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపులో భాగంగా సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించి డీలర్లు నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంతకు ముందు వరంగల్ శివనగర్‌లోని అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బంద్ పాటించామని తెలిపారు. విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోకుండా విక్రయించిన డీలర్‌పై కేసులు పెట్టడం సరికాదన్నారు. ఉత్పత్తి కేంద్రాల వద్ద ప్రభుత్వమే నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల కట్టడి చేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలు డీలర్లకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌరిశెట్టి నాగరాజు, పున్నమి రాజేందర్‌రెడ్డి, గాయత్రి రాంచంద్రారెడ్డి, గుర్రం మధుసూదన్‌రావు, జిల్లా నేతలు ప్రవీణ్, పరమేశ్వర్, శ్రీనివాస్ లాహోటి, హరిందర్, రాజేశ్వర్‌రావు, రాజేంద్రయాదవ్, యాదగిరి, జగన్, సంపత్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఎలేందర్‌రెడ్డి, వెంకన్న, పైడి, ఆనందం పాల్గొన్నారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
నాగుర్ల వెంకటేశ్వర్లు


