మహబూబాబాద్: పెట్రోల్ బంక్‌ల్లో డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెట్రోల్ కూడా అరకొరగా ఉంది. ఇదే అదునుగా కొంతమంది డీలర్లు ఎక్కువ కమీషన్ కోసం పవర్ పెట్రోల్ విక్రయిస్తున్నారు. కాగా, యుద్ధాల వల్లే సప్లై తగ్గి డిమాండ్ పెరిగి కొరత ఏర్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 80పైగా పెట్రోల్ బంక్‌లు..
జిల్లాలో 80పైగా పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్, ఐఏసీఎల్, బీపీసీఎల్ కంపెనీల పెట్రోల్, డీజిల్‌ను డీలర్లు విక్రయిస్తున్నారు. జిల్లాకు ఎక్కువగా సూర్యాపేట, చర్లపల్లి, వరంగల్ డిపోల నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది. ఒక్క ట్యాంకర్‌కు రూ.12 లక్షలు చెల్లిస్తున్నారు. యుద్ధాల కంటే ముందు డిపోల నిర్వాహకులు ముందస్తు డబ్బులు చెల్లించకపోయినా.. డీజిల్, పెట్రోల్ సరఫరా చేసి ఆ తర్వాత వసూలు చేసుకునేవారు. కానీ యుద్ధాల నేపథ్యంలో ఏర్పడిన కొరతతో ముందుగానే డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఐదురోజులకోసారి..
పెట్రోల్, డీజిల్‌ను ఐదురోజులకోసారి సరఫరా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు డబ్బులు చెల్లించకున్నా.. ఫోన్ చేయగానే డిపో నుంచి సరఫ రా చేసే వారు. అయితే రెండురోజులుగా డీజీల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధికి ఎఫెక్ట్..
ట్రాక్టర్లు, ఇతర వాహనాలు డీజిల్ లేక నిలిచిపోవడంతో వాటి ద్వారా ఉపాధి పొందే డ్రైవర్లు, కూలీ లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది బ్లాక్‌లో కొనుగోలు చేసి నడుపుతున్నారు. వారు అధికంగా డబ్బులు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులపై ఆర్థికభారం పడుతోంది.
పవర్ పెట్రోల్ విక్రయాలు:
పెట్రోల్ లీటర్ ధర రూ.107.62 ఉండగా పవర్ పెట్రోల్ లీటర్ ధర రూ.117.94 ఉంది. రెండింటి మధ్య రూ.10 వ్యత్యాసం ఉంది. పెట్రోల్ కొరత సాకుగా చూపుతూ కొంతమంది డీలర్లు ఎ క్కువ కమీషన్ కోసం పవర్ పెట్రోల్ విక్రయాలు చే స్తున్నారు. దీంతో వాహనదారులు నష్టపోతున్నా రు.
సప్లై లేకనే అంటున్న అధికారులు..
డిపోల నుంచి సప్లై తక్కువగా ఉండడం, డిమాండ్ అధికంగా ఉండడంతో సమస్య వస్తుందని అధికా రులు చెబుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ చేసిన త ర్వాత ఐదు రోజులకు బంక్‌లను సరఫరా అవుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు కొన్ని బంక్‌ల డీలర్లు కాసులకు కక్కుర్తి పడి కల్తీ విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నర్సంపేట రోడ్డులోని ఓ బంక్, తొర్రూరు రోడ్డులోని మరో బంక్‌లో కల్తీ పెట్రోల్ విక్రయాలు చేశారని వాహనదారులు యాజమాన్యాలతో వా గ్వాదం చేశారు.
తనిఖీలు లేకనే..
డీసీఎస్‌ఓ, తూనికలు, కొలతల అధికారులతో పా టు సంబంధిత అధికారులు బంక్‌లను తనిఖీ చే యాలి. కానీ, తూతూమంత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తూనికలు, కొలతల రెగ్యులర్ అధికారి లేకపోవడంతో తనిఖీలు చేపట్టడం లేదు. హనుమకొండ తూనికలు, కొలతల అధికారికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
బంక్‌ల వద్ద బారులు..
పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులుదీరుతున్నారు. గంటల తరబడి వాహనాలతో క్యూలో నిలబడుతున్నారు. సమస్య ఎక్కడ ఉంది. దానికి గల కారణాలను ప్రచారం చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
జిల్లాలో అరకొరగా పెట్రోల్
ఇదే అదునుగా పవర్ పెట్రోల్ విక్రయాలు
కొంత మంది డీలర్ల దోపిడీ
సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువతోనే
కొరత అంటున్న అధికారులు
బంకుల వద్ద వాహనదారుల బారులు


