మక్క రైతులు ఆందోళన చెందవద్దు | - | Sakshi
Sakshi News home page

మక్క రైతులు ఆందోళన చెందవద్దు

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

తొర్రూరు రూరల్‌: మొక్కజొన్నల తరలింపులో రైతులు ఆందోళన చెందవద్దని తొర్రూరు మార్కెట్‌ చైర్మన్‌ హనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సోమారం గ్రామంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అమ్మాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు మండల పరిధిలో రెండు మక్కల, గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని, ప్రతీ గింజను సెంటర్లలో కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కొమురవెల్లి లింగమూర్తి, ముద్ద వీరారెడ్డి, బానోతు శ్రీను, నాయకులు చింతకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, మేకల కుమార్‌, వీరారెడ్డి, డొనక ఉప్పలయ్య, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

విద్యుత్‌తో

అగ్ని ప్రమాదం జరగలేదు

బయ్యారం: మండలంలోని కొత్తగూడెం సమీపంలోని మొక్కజొన్న చేన్లలో విద్యుత్‌ వల్ల అగ్నిప్రమాదం జరగలేదని విద్యుత్‌శాఖ డీఈ ఏ.కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన పరిశీలించారు. అగ్ని ప్రమాద సమయంలో విద్యుత్‌ సరఫరా లేదని, ఇతర కారణాల వల్ల ప్రమాదం చోటుచేసుకోవచ్చన్నారు. ఆయన వెంట ఏడీఈ రమేశ్‌, ఇన్‌చార్జ్‌ ఏఈ సందీప్‌ తదితరులు ఉన్నారు.

వేసవితాపం..

వానరాల సేద

గార్ల: కోతులు వేసవితాపం నుంచి సేద తీరేందుకు ప్రభుత్వ కార్యాలయాల కిటికీల వద్ద గాఢ నిద్రలోకి వెళ్లాయి. ఆదివారం మండలంలోని ఎంపీడీఓ, పంచాయతీరాజ్‌ డీఈ కార్యాలయాల్లోని కిటికీల వద్ద మధ్యాహ్నం ఒంటిగంటకు కోతుల గాఢ నిద్రలోకి వెళ్లి సేద తీరుతున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా బంధించింది.

రామప్పలో విదేశీయుల సందడి

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం కామెరూన్‌ దేశానికి చెందిన సోనిలీ, ప్రాన్స్‌ దేశానికి చెందిన ఇవాన్‌ వెబర్‌లు వేర్వేరుగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వివరించగా వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement