కేవీకేలో నూతన ఒరవడి | - | Sakshi
Sakshi News home page

కేవీకేలో నూతన ఒరవడి

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

రెగ్యులర్‌ ఉద్యోగులకు స్థానచలనం

ఒప్పంద విధానంలో నియామకానికి కసరత్తు

మహబూబాబాద్‌ రూరల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి విజ్ఞాన కేంద్రం సేవల్లో మార్పులు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకు స్థానచలనం కల్పిస్తూ.. వారి స్థానంలో ఒప్పంద విధానంలో ఉద్యోగుల నియామకానికి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రభు త్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా, మహబూబాబాద్‌ మండలం మల్యాలలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధి లోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్న వారందరూ బదిలీపై వెళ్లనున్నారు. వారి స్థానంలో ఒప్పంద విధానంలో ఉద్యోగులను నియమించనున్నారు. ఐదు సంవత్సరాల ఒప్పంద నిర్ణయం మేరకు ఉద్యోగులను శాస్త్రవేత్తలుగా విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది.

ఒక ప్రోగ్రాం కోఆర్డినేటర్‌..

ఆరుగురు శాస్త్రవేత్తలు

కేవీకేలో ప్రస్తుతం రెగ్యులర్‌ ఉద్యోగులుగా ఒక ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, ఆరుగురు శాస్త్రవేత్తల పోస్టులు ఉన్నాయి. ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా సీనియర్‌ శాస్త్రవేత్తను నియమించారు. కాగా, ఒకరు విస్తరణ శాస్త్రవేత్త, ఒకరు హోమ్‌ సైన్స్‌, ఒకరు ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, ఒకరు హార్టికల్చర్‌, ఒకరు వెటర్నరీ, ఒకరు క్రాప్‌ ప్రొడక్షన్‌ విభాగ శాస్త్రవేత్త ఉండాలి. అయితే ఇందులో ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, ఇద్దరు శాస్త్రవేత్తలు ఉండగా.. నాలుగు శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రైతాంగానికి సేవలు...

మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు జిల్లాలో ఉన్న వివిధ రైతుల పంట పొలాలను సందర్శించి పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రథమ శ్రేణి పరీక్షల ద్వారా కొత్త సాంకేతికతను రైతులకు అందించి వారి ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఆన్‌ ఫామ్‌ టెస్టింగ్‌ ద్వారా రైతులు కొత్త పద్ధతుల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి పరిశోధనలు చేసి వివరిస్తారు. జిల్లాలోని యువ రైతులు, మహిళా రైతులను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విత్తనోత్పత్తి ద్వారా కొత్త రకాల వంగడాలు ఉత్పత్తి చేసి రైతులకు అందించడంతో పాటు క్షేత్ర సందర్శనల ద్వారా రైతుల పొలాల్లోని సమస్యలను తెలుసుకుని, అనుగుణంగా సూచనలు, సలహాలు ఇస్తుంటారు. రైతులకు నూతన సాంకేతికతకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు టీవీలు, రేడియో, న్యూస్‌ పేపర్‌ ద్వారా తెలియజేస్తారు.

నియామకానికి కసరత్తు..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మల్యాల కేవీకేలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకు స్థానచలనం కలుగనుండగా ఒప్పంద విధానంలో ఉద్యోగుల నియామకానికి కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను ఆర్‌ఏఆర్‌ఎస్‌, డాట్‌ సెంటర్‌, అగ్రికల్చర్‌ కళాశాలలకు బదిలీ చేయనున్నారు. కాగా, ఒప్పంద విధానంలో స్థానికులకు ఉద్యోగాలు వస్తే వారు ఇక్కడి పరిస్థితులపై పట్టు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించగలుగుతారని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement