● బాధ్యతలు స్వీకరించిన
లెనిన్ వత్సల్ టొప్పో
● ఈఎస్‌ఎస్‌లో గ్రౌండింగ్ అంతంతే..
● ముందుకు సాగని రైతు భరోసా,
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల సరళీకృతం
● పరిష్కారానికి నోచుకోని గిరివాణి
వినతులు
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఏటూరునాగారం పీఓగా లెనిన్ వత్సల్ టొప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. కాగా నూతనంగా బాధ్యతల చేపట్టిన పీఓకు ఐటీడీఏలో నెలకొన్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
పథకాల అమలు నిల్..
2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్‌ఎస్)లో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్‌లో ఉన్నా యి. వాటికి ఆర్థికశాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్‌కు నిధులు వస్తేనే బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలు పథకం తెరపైకి తేవడంతో ఈఎస్‌ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల పీఎం కుసుము యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి కాగితాలకే పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు.
బోసిపోయిన టైలరింగ్ స్టోర్..
గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కానీ ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అలాగే కొంత మందికి ఇటుకల తయారీ మిషన్లు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమ నడపడం లేదు. దీంతో సామగ్రి తుప్పుపట్టిపోతోంది. న్యూట్రి బాస్కెట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు.
సబ్బుల ఫ్యాక్టరీ క్లోజ్..
శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.


