● నేటి నుంచి పది రోజుల పాటు
కార్యక్రమాలు
● ముస్తాబైన ఆలయం..
తరలిరానున్న భక్తజనం
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవా దాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. భద్రాచలం సతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడుమురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్‌చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పా ట్లు చేశారు.
అంకురార్పణతో జాతర ప్రారంభం
హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యా గశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచ న, పసరిషత్ ప్రార్థన, రుత్విక్‌వరణం, రక్షాబంధన ం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజా రోహ ణం, 30న ఎదుర్కోలు, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4న తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ తెలిపారు.


