కాజీపేట రూరల్: కాజీపేటలోని డీజిల్ లోకోషెడ్ (డీఎల్‌ఎస్) ఇండియన్ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈనెల 28వ తేదీన 53 వసంతోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1973 ఏప్రిల్ 21న నాటి రైల్వే జీఎం పీఎన్ కౌల్ 30 లోకోల కెపాసిటీతో కాజీపేట డీజిల్ లోకోషెడ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 638 మంది కార్మికులతో 242 డీజిల్, ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణతో భారతీయ రైల్వేలో ప్రత్యేకతను సంపాదించుకుంది. డీజిల్‌షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్‌వీ వెంకటకుమార్ పర్యవేక్షణలో కార్మికుల విధులు నిర్వర్తించి, లోకోల నిర్వహణ చేస్తారని రైల్వే ట్రేడ్ యూనియన్ల నాయకులు తెలిపారు.
● లోకోల నిర్వహణ : ప్రస్తుతం డబ్ల్యూజీ–7 లోకోలు విద్యుత్ 160, డబ్ల్యూడీజీ–4 లోకోలు 82, టవర్ కార్స్–32, 140 టన్నుల క్రేన్ నిర్వహణ కాజీపేట డీజిల్ లోకోషెడ్ కేంద్రంగా జరుగుతోంది. విద్యుత్ లోకోల వాడకం పెరిగి డీజిల్ లోకోల నిర్వహణ తగ్గుతోంది.
● లోకోల షెడ్యూల్డ్ : లోకో జీవిత కాలంలో 6 సంవత్సరాలకు అన్వల్ ఓవరాలింగ్, 2 సంవత్సరాలకు టర్క్ ఓవరాలింగ్, 3 సంవత్సరాలకు ఇంటర్ మీడియట్ ఓవరాలింగ్, 72 నెలలకు పీరాడికల్ ఓవరాలింగ్ చేస్తారు.
● పనికిరాని 17 లోకోల మరమ్మతు : వినియోగంలో లేని 17 లోకోలను కాజీపేట డీజిల్ లోకోషెడ్ అధికారులు నైపుణ్యం గల కార్మికులతో మరమ్మతు చేయించి తిరిగి పట్టాలపైకి పంపించారు. ఈ సందర్భంగా అధికారులను, కార్మికులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు అభినందించారు.
ఇతర దేశాల రైల్వేలకు..
కాజీపేట డీజిల్ లోకోషెడ్ నుంచి నైపుణ్యం గల రైల్వే టెక్నీషియన్లు టాంజానియా, ముజాంబిక్, మలేషియా రైల్వేలకు డిప్యుటేషన్‌పై కొన్ని సంవత్సరాల పాటు వెళ్లారు. అక్కడి రైల్వే పనితీరు తెలుసుకున్నారు.
ఎక్స్‌ప్రెస్ ఇంజన్ల నిర్వహణ..
కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఎక్స్‌ప్రెస్ ఇంజన్ల నిర్వహణలో పెట్టింది పేరుగా విధులు నిర్వర్తించి అధికారుల నుంచి ప్రశంశలు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రయాణించే రాజధాని, కోణార్క్, నాగర్‌సోల్, ఫలక్‌నూమా, గంగా కావేరి, జీటీ తదితర ఎక్స్‌ప్రెస్‌ల ఇంజన్ల నిర్వహణ 5 ఏళ్ల క్రితం వరకు కాజీపేట డీజిల్‌షెడ్ వారే చేశారు.
కరోనా సమయంలోనూ ఇంజన్ల నిర్వహణ..
కరోనా సమయంలో కూడా కాజీపేట డీజిల్‌షెడ్ కార్మికులు ఇంజన్ల నిర్వహణ చేశారు. వేరే రాష్ట్రాల ప్రజలను తరలించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన కోవిడ్ రైళ్లకు మన వారే ఇంజన్ల లింక్‌లను పంపించి మానవతా దృక్పథం చాటారు.
2019 నుంచి విద్యుత్ లోకోల నిర్వహణ..
కాజీపేట డీజిల్ లోకోషెడ్‌లో 2019 నుంచి విద్యుత్ లోకోలను నిర్వహిస్తున్నారు. షెడ్ అధికారుల పర్యవేక్షణలో డీజిల్ ఇంజన్లను నిర్వహించే కార్మికులు శిక్షణ తీసుకొని విద్యుత్ లోకోల నిర్వహణ సైతం చేస్తుండడం విశేషం. ఐదు లోకోల నిర్వహణతో నేడు 162 విద్యుత్ లోకోలను నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు దేశంలో ఏషెడ్డు నిర్వహణ చేయలేని గజరాజ లోకోల నిర్వహణ కూడా కాజీపేట కార్మికులే చేశారు.
భారతీయ రైల్వేలో ఉత్తమ షెడ్డుగా గుర్తింపు..
భారతీయ రైల్వేలో 54 డీజిల్ లోకోషెడ్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో గుత్తి, గుంతకల్, మౌలాలి, విజయవాడ, కాజీపేట డీజిల్ లోకోషెడ్లు ఉన్నాయి. వీటిలో కాజీపేట డీజిల్‌షెడ్ ప్రత్యేకత సంతరించుకుంది. భారతీయ రైల్వేలో ఉత్తమ నిర్వహణ షెడ్డుగా, రైల్వే బోర్డు అవార్డు, రైల్వే జీఎం అవార్డుతోపాటు అనేక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ నెల 28వ తేదీన డీజిల్‌షెడ్ ప్రాంగణంలో రైల్వే అధికారులు, కార్మిక కుటుంబాలతో కలిసి షెడ్డు 53వ వసంతాల వేడుకలు జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
కాజీపేటలో 1973లో
డీజిల్ లోకోషెడ్ ఏర్పాటు
నేడు 638 మంది కార్మికులు..
242 డీజిల్, ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణ
కరోనా సమయంలో ఇంజన్లను ఇచ్చిన కార్మికులు
రేపు వార్షికోత్సవానికి రైల్వే అధికారుల ఏర్పాట్లు


