కొత్తపల్లిగోరిలో విషాదఛాయలు | - | Sakshi
Sakshi News home page

కొత్తపల్లిగోరిలో విషాదఛాయలు

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

వైభవంగా వాసవి కన్యకాపరమేశ్వరి శోభాయాత్ర

రేగొండ: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారీమడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర డిగ్రీ కళాశాలలో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన రాచర్ల దేవేందర్‌–భవాని దంపతుల కుమారుడు కార్తీక్‌ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కళాశాల హాస్టల్‌లో కార్తీక్‌ బలవన్మరణానికి పాల్పడడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చేతికి అందివచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

వరంగల్‌ చౌరస్తా: వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులోని పోచమ్మగుడి వద్ద యాత్రను వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద ప్రారంభించారు. అతిథులుగా అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ హాజరయ్యారు. కార్పొరేటర్‌ గందె కల్పన నవీన్‌, దాచేపల్లి సీతారాం, పొట్టి శ్రీనివాస్‌, దుబ్బా శ్రీనివాస్‌ నేతృత్వంలో యాత్ర వరంగల్‌ హెడ్‌పోస్టాఫీస్‌, జేపీఎన్‌ రోడ్డు, పిన్నావారి వీధి, బట్టలబజార్‌, రామన్నపేట కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు చేరింది. కోలాటాలు, డప్పుచప్పళ్లు, వాసవి మాత స్మరణలో జైత్రయాత్ర కనులపండువగా జరిగింది. కార్యక్రమంలో గుండా నమఃశివాయ, అనంతుల కేదారి, హేంచందర్‌, శ్రావణి, మిడియాల నూతన్‌, నాళ్ల సతీశ్‌, లావణ్య, మంచాల విజయ్‌, దేవా అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

కేఎంసీకి అన్ని విధాలా సహకారం

కాశిబుగ్గ: చదువుకున్న కేఎంసీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే, పూర్వ విద్యార్థి డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు వక్తలు అన్నారు. ఆదివారం కాకతీయ వైద్య కళాశాల అలుమ్నీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కేఎంసీలోని ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ కస్తూరి శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ జార్జ్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ సంధ్యారాణి, ఇతర కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కళాశాలలో అన్ని రకాల వసతుల కల్పన కోసం సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, లైబ్రరీ పునర్నిర్మాణం కోసం భూమి పూజ చేయగా, లైబ్రరీ అభివృద్ధి కోసం డాక్టర్‌ కస్తూరి శ్రీధర్‌ రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుంకరనేని సంధ్య అనిల్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీశ్‌చంద్రారెడ్డి, డాక్టర్‌ బందెల మోహన్‌రావు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వాహనాలు ఢీ..

నలుగురికి గాయాలు

హసన్‌పర్తి : హనుమకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని హసన్‌పర్తి ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఆదివారం ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. నగరానికి చెందిన ఎ.చైతన్య కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు బయల్దేరింది. చైతన్య ప్రయాణిస్తున్న కారు ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే.. కరీంనగర్‌ నుంచి హనుమకొండ వైపునకు వస్తున్న మరో వాహనం అతివేగంగా వచ్చి చైతన్య ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈఘటనలో చైతన్యతో పాటు వాహనంలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఇరు రూట్లలో ప్రయాణించే వాహనాలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement