మండే ఎండకు చెక్‌ పెట్టేద్దామా? | - | Sakshi
Sakshi News home page

మండే ఎండకు చెక్‌ పెట్టేద్దామా?

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

జాగ్రత్తలు పాటించాలి..

ఖిలా వరంగల్‌: ఇంటర్‌, పదో తరగతి విద్యార్థులకు సెలవులు వచ్చేశాయ్‌. పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు శనివారం నుంచే ఇచ్చారు. కుటుంబ సమేతంగా స్వగ్రామాలు, బంధువుల ఊళ్లు, విహారయాత్రలకు వెళ్లే సమయం ఇది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకూ వెళ్తుంటారు. వేసవి తీవ్రత ఏస్థాయిలో ఉందో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటలు దాటిందంటే అడుగు బయటపెట్టే పరిస్థితి ఉండడం లేదు. సాయంత్రం ఆరుగంటలు దాటినా వేడి, రాత్రి పది గంటలు దాటినా వడగాల్పుల తీవ్రత తగ్గడం లేదు. ఈనేపథ్యంలో ప్రయాణ సమయాల్లో ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. వడదెబ్బ తీవ్రత, జ్వరాలు తదితర సమస్యలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అందుకే ప్రయాణాలను ఉదయం పది గంటలలోగా ముగిసేలా, సాయంత్రం ఐదు తర్వాత మొదలయ్యేలా ప్లాన్‌ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొత్త ప్రాంతాలకు వెళ్లినా, నీడ పట్టున ఉండేలా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.

ప్రయాణంలో ఈ ఆహారం తీసుకోవాలి..

బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు విటమిన్‌ బీ లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చ రంగులో లభించే కాయగూరలు, ధాన్యాలు, క్యారెట్‌ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ల బాటిల్‌, పండ్లరసాలు దగ్గర ఉంచుకుని తరచూ తాగుతుండాలి. తద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ అందుతుంది. ప్రయాణంలో వాహనాన్ని ఆపినప్పుడు కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. వదులైన దుస్తులు ధరించాలి. తద్వారా శరీరానికి గాలి బాగా తగులుతుంది. చిన్నపిల్లలపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణంలో తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రోలైట్‌ ద్రావణాలు (ఓఆర్‌ఎస్‌) కూడా వెంట తీసుకెళ్లడం మరువరాదు. పిల్ల లకు లేతరంగు గల పలుచని దుస్తులు వేయాలి. ముఖానికి సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ను తప్పనిసరిగా రాసుకోవాలి. వేసవిలో బయట తిరిగేటప్పుడు ఉల్లిపాయపై తొక్క తీసి దాన్ని ప్యాంట్‌ జేబులో వేసుకోవాలి. మహిళలు హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచుకోవాలి. దీని వల్ల వడదెబ్బ తగలదు. ఉల్లిపాయను సగం కోసి చిన్న పిల్లల చొక్కాలో ఉంచితే మరీ మంచిది. ఉల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మొహమాటానికి పోకుండా ఆరోగ్యం కోసం ఈచిట్కాను పాటించాలి.

శీతలపానీయాలు వద్దే వద్దు..

ప్రయాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్‌ డ్రింక్స్‌ తాగరాదు. శీతల పానీయాల్లో ఉండే పాస్ఫోరిక్‌ యాసిడ్‌ కారణంగా వాంతులయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికితోడు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కలవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ అమాంతం పెరుగుతాయి. రక్తపోటు పెరుగుతుంది. కూల్‌ డ్రిక్స్‌ తాగడం అంటే చిన్న మోతాదులో డ్రగ్స్‌ తీసుకున్నట్లే అంటున్నారు వైద్యులు.

పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు

సుదీర్ఘ ప్రయాణం వద్దు

కూల్‌ డ్రింక్స్‌ తాగడం ప్రమాదకరం

పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి

దాహం వేయకపోయినా నీటిని తీసుకోవాలి

వేసవి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఎండ తీవ్రత వల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలోనే శరీరంలోని ఉప్పు శాతం తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ద్ర వపదార్థాలను తీసుకోవాలి. పలుచగా ఉండే దుస్తులు వేసుకోవాలి. చిన్నపిల్లలకు ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లను ఆరగంటకు ఒకసారి తాగించాలి. ఇంటి నుంచి ఆహర పదార్థాలు వెంట తీసుకువెళ్లి చల్లని ప్రదేశంలో ఆరగించడం శ్రేయస్కరం. నూనె పదార్థాలు భుజించరాదు.

– డాక్టర్‌ నరేశ్‌కుమార్‌,

వైద్యమండలి రాష్ట్ర సభ్యుడు, వరంగల్‌

Advertisement
 
Advertisement
Advertisement