సులభంగా.. వేగంగా | - | Sakshi
Sakshi News home page

సులభంగా.. వేగంగా

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

హన్మకొండ: వినియోగదారులు సులభంగా, వేగంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించే విధానం అందుబాటులో ఉంది. ఇంటి వద్ద నుంచి సులువుగా బిల్లులు చెల్లించే అవకాశం విద్యుత్‌ పంపిణీ సంస్థలు కల్పించాయి. ఏ కాలమైనా సరే బిల్‌ కలెక్షన్‌ సెంటర్లకు వెళ్లి క్యూలో గంటల తరబడి నిలబడి చెల్లించడం తప్పుతుంది. డిజిటల్‌ విధానంలో బిల్లుల చెల్లింపును టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రోత్సహిస్తోంది. ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి ఉష్ణొగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో విద్యుత్‌ వినియోగదారులు ఇంటి వద్ద నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కేంద్రాలకు వచ్చి వెళ్లడం, క్యూలో నిలబడడం వంటి వ్యయప్రయాసలు తగ్గుతాయి.

ఏటేటా పెరుగుతున్న చెల్లింపులు..

డిజిటల్‌ చెల్లింపులు ప్రతి ఏటా 10 శాతం పెరుగుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే హనుమకొండ సర్కిల్‌ పరిధిలో 2024– 2025 ఆర్థిక సంవత్సరంలో 13,99,677 మంది వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేయగా.. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో 15,73,410 మంది వినియోగదారులు డిజిటల్‌ విధానం ద్వారా చెల్లింపులు చేశారు. వరంగల్‌ సర్కిల్‌లో 2024–2025 సంవత్సరంలో 7.62 లక్షల మంది వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులు చేయగా, 2025–2026లో 8.20 లక్షలకు పెరిగింది.

యాప్‌లకు ఆదరణ..

ప్రస్తుతం మనం ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో డిజిటల్‌ చెల్లింపుల హవా నడుస్తోంది. గతంలో లాగా గంటల తరబడి లైన్లలో నిల్చొని బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే కాలు కదపకుండా పనులు పూర్తి చేసే సౌకర్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే డిజిటల్‌ చెల్లింపులకు, ఆ సేవలను అందించే యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే, భీమ్‌ వంటి పలు యాప్స్‌ డిజిటల్‌ చెల్లింపులకు ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ఈ యాప్‌లు విద్యుత్‌ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర సేవలు అందిస్తున్నాయి.

పారదర్శకంగా అకౌంటింగ్‌ వ్యవస్థ

విద్యుత్‌ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌లోని ప్లేస్టోర్‌లో టీజీ ఎన్పీడీసీఎల్‌ అని టైప్‌ చేసి యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. అందులో విద్యుత్‌ బిల్లుపై ఉన్న యూఎస్‌సీ నంబర్‌ నమోదు చేసుకొని ప్రతీ నెల బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టంలో భాగంగా బ్యాంకింగ్‌ యాప్‌ల ద్వారా కూడా విద్యుత్‌ బిల్లులు చెల్లింపు చేసే అవకాశముంది. భీమ్‌ యాప్‌, ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం ద్వారా బిల్లులు సులువుగా చెల్లించే సౌకర్యం అరచేతిలో ఉంది. ఇలా చేయడం వల్ల ప్రతి నెల చెల్లించాల్సిన మొత్తంపై ముందస్తు సమాచారం అందుతుంది. అకౌంటింగ్‌ వ్యవస్థ పారదర్శకంగా, సురక్షితంగా ఉంటుంది.

డిజిటల్‌ విధానంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు

ప్రోత్సహిస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం

ఏటా 10 శాతం పెరుగుతున్న ఆన్‌లైన్‌ పేమెంట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement