అన్నదాత కష్టం అగ్గిపాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత కష్టం అగ్గిపాలు

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

బయ్యారం: పంటచేనుల మధ్య ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి చెలరేగిన మంటలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను బుగ్గిపాలు చేశాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో కళ్లెదుటే కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామ సమీపంలోని ధరావత్‌ హరిలాల్‌ మొక్కజొన్న చేనులో శనివారం వ్యాపించిన మంటలు నిమిషాల్లోనే సమీపంలోని చేనులకు వ్యాపించాయి. ఈ మంటలు సుమారు వంద ఎకరాల్లోని పంటభూములకు వ్యాపించగా ఇందులో 30 ఎకరాల్లో విరిచి కుప్పలుగా పోసిన కంకులు కాలిపోయాయి. అదేవిధంగా మంటలు వ్యాపించిన భూముల్లో ఉన్న 40 బోర్లతో పాటు పైపులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 30 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు.

కొత్తగూడెం గ్రామాన్ని చుట్టుముట్టిన మంటలు..

మొక్కజొన్న సొప్పతోపాటు కంకులకు అంటుకున్న మంటలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో స్థానికులతో పాటు ఘటనాస్థలికి చేరుకున్న గార్ల–బయ్యారం సీఐ రవీందర్‌ మహబూబాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గ్రామానికి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో కొత్తగూడెం, లింగగిరి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పెద్దకోమటిపల్లి–గణేశ్‌పల్లి గ్రామ శివారులో..

మొగుళ్లపల్లి: షార్ట్‌ సర్క్యూట్‌తో 30 ఎకరాల మొక్క జొన్న పంట కాలిపోయింది. ఈ ఘటన శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి–గణేశ్‌పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వెలువడిన మంటలతో పక్కనే ఉన్న మొక్క జొన్న పంటకు నిప్పు అంటుకుంది. దీంతో ఆ మంటలు చుట్టుపక్కల పంటలకు వ్యాపించడంతో దాదాపు 30 ఎకరాల్లో మొక్క జొన్న పంట అగ్నికి ఆహుతైంది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఆర్‌ఐ శివరామకృష్ణ సందర్శించి వివరాలను అడిగి తెలుకున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి

చెలరేగిన మంటలు

పలుచోట్ల అగ్నికి ఆహుతైన

మొక్కజొన్న పంట

కొత్తగూడెంలో 30 ఎకరాలు,

40 బోర్లు, పైపులు దగ్ధం

పెద్దకోమటిపల్లి–గణేశ్‌పల్లి శివారులో 30 ఎకరాలు

లక్షలాది రూపాయల నష్టం

కన్నీరుమున్నీరవుతున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement