● అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
తొర్రూరు: విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేందుకు వేసవి శిక్షణ శిబిరాలు దోహదపడుతాయని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ కేంద్రంలోని సమీకృత వసతి గృహంలో వసతి గృహాల విద్యార్థులకు వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం వసతిగృహాలు, గురుకులాల ద్వారా కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలంటే నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. మే 24 వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని, రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల విద్యార్థులు వివిధ అంశాలపై తర్ఫీదు పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్, డీఎల్‌పీఓ ఆర్. పుల్లారావు, ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, కమిషనర్ వక్కల శ్యాంసుందర్, వార్డెన్లు సదానందం, మధురిమ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు
పరిష్కరించాలి
బయ్యారం: ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారం, గార్ల మండలాల్లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కను శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి వినతిపత్రాలు అందజేశారు. మండలంలోని కొత్తపేట పంచాయతీలోని ఇల్లెందు రోడ్డు నుంచి గార్ల మండలం అంకన్నగూడెం వరకు రహదారిని నిర్మిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వీటితో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్తపేట సర్పంచ్ ప్రవీణ్‌నాయక్, సొసైటీ మాజీ చైర్మన్ మధుకర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
మలేరియా రహిత
సమాజాన్ని నిర్మించాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
కురవి: మలేరియా రహిత సమాజాన్ని నిర్మించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కురవి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. దోమ కాటు వల్ల మలేరియా జ్వరం వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. దోమ తెరలు వాడి దోమల నుంచి రక్షించుకోవాలని సూచించారు. జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సారంగం, డాక్టర్ విరాజిత, డాక్టర్ నాగేశ్వర్‌రావు, భిక్షపతి, గౌసుద్దీన్, లింగారెడ్డి, రాజకుమారి, నీరజ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్స్ సరఫరాలో
ఆంక్షలు విధించొద్దు
మహబూబాబాద్ రూరల్: ఫర్టిలైజర్స్ సరఫరాలో ఎలాంటి లింకు ప్రొడక్ట్స్ అంటగట్టవద్దని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీఏఓ బి.సరితకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రతాపని పాండురంగయ్య మాట్లాడుతూ.. ఆల్ ఇండియా ఆగ్రో ఇన్‌ఫుట్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎరువుల ఉత్పత్తిదారులు ఫర్టిలైజర్స్ సరఫరాపై ఎఫ్‌ఓఎల్ ఇవ్వాలని, ఎలాంటి లింకు ప్రొడక్ట్స్ లేకుండా ఫర్టిలైజర్స్ సరఫరా చేయాలన్నారు.


