నెహ్రూసెంటర్: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. కార్మికుల నిరసనలు, ఆందోళనలతో మహబూబాబాద్ డిపో పరిధిలో ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది, ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. డిపోలో ఆందోళనల నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ర్యాలీ.. నిరసన.. ధర్నా..
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి డిపో వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. కార్మికులు చేపట్టిన ర్యాలీకి సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఆర్‌ఎస్, బీజేపీ, మద్దతు తెలిపి పాల్గొన్నారు. నర్సంపేట డిపోలో ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌గౌడ్ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో గేటు ఎదుట కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథిఏసీ నాయకుడు డోలి సత్యనారాయణ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.అజయ్‌సారథి, ఆర్టీసీ జేఏసీ నాయకులు మల్లయ్య మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు పరిష్కరించేలా సర్వత చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గుజ్జు దేవేందర్, మైస శ్రీనివాసులు, రేషపల్లి నవీన్, హెచ్.లింగ్య,చీకటి మహేష్‌గౌడ్, నర్సింహారెడ్డి, మధు, చైతన్య, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
డిపో నుంచి కదలని బస్సులు..
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనడంతో మూడోరోజు ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు వెళ్లలేదు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకల సాగించారు. మొత్తంగా 76 బస్సులుండగా డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలోకి వెళ్లగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మూడో రోజుకు చేరిన
ఆర్టీసీ కార్మికుల సమ్మె
పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో
ర్యాలీ, ధర్నా
రోడ్డెక్కని బస్సులు..
ప్రయాణికుల ఇబ్బందులు
డిపోలో పోలీసు బందోబస్తు


