నిండా ముంచారు..! | - | Sakshi
Sakshi News home page

నిండా ముంచారు..!

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

సాక్షి, మహబూబాబాద్‌: మొక్కజొన్న విత్తనాల దిగుబడి కోసం దేశంలోని పలు విత్తన కంపెనీల ఏజెంట్లు గ్రామాల్లో రైతుల వద్దకు వచ్చారు. మేమే విత్తనాలు ఇస్తాం. ఆడ, మగ విత్తనాలు వేర్వేరుగా నాటి సాగుచేయాలి. ఇలా చేస్తే సాధారణ రేటు కన్నా అదనంగా ధర చెల్లించి తామే కొనుగోలు చేస్తామని చెప్పారు. దీంతో జిల్లాలో రైతులు 40వేల ఎకరాల మేరకు పలు విత్తన కంపెనీలకు చెందిన మొక్కజొన్న పంటలు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో కొన్ని కంపెనీలు ఇచ్చిన విత్తనాలు మంచి దిగుబడి రాగా.. మరికొన్ని కంపెనీల విత్తనాలతో సాగుచేసిన పంటలో నాసిరకం కంకులు, ఎత్తు సరిగ్గా ఎదగకపోవడంతో సగం పంట కూడా రాలేదని రైతులు చెబుతున్నారు.

దిగుబడి తగ్గడంతో రైతు దిగాలు..

సాధారణ మక్క పంటకంటే.. ఆడ, మగ మొక్కజొన్న పంట సాగుచేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశపడిన పలువురు రైతులకు నిరాశే మిగిలింది. ఎకరానికి 35 క్వింటాళ్ల మేరకు దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ. 3,500 మేరకు ధర పెట్టి కొనుగోలు చేస్తామని కంపెనీల ఏజెంట్లు చెప్పినట్లు రైతులు అంటున్నారు. ఎక్కువ లాభం వస్తుందని పంటను కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇతర పంటలకు నీరు బంద్‌ చేసి మొక్కజొన్నకు నీరు పెట్టామని రైతులు అంటున్నారు. ఇంత చేసినా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల మేరకే దిగుబడి వచ్చిందని, దీంతో నష్టపోయామని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్క నర్సింహులపేట మండలంలోనే 30 ఎకరాల మేరకు రైతులు నష్టపోయారని, జిల్లాలో వందల ఎకరాల్లో నష్టంవాటిల్లినట్లు రైతులు అంటున్నారు.

వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు

మంచి దిగుబడి వస్తుంది, లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు అధికారుల వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేశారు. అయితే విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవడం మా పరిధి కాదని అధికారులు చేతులు ఎత్తేశారు. దీంతో గత్యంతరం లేక రైతులు వినియోగదారుల ఫోరం ఆశ్రయించారు. తమ కుటంబం అంతా చేసిన కష్టం విలువ, జరిగిన నష్టం మొత్తం లెక్కించి చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మోసపోయిన మొక్కజొన్న రైతులు

ఆడ, మగ విత్తనాలు ఇచ్చిన ఓ కంపెనీ

పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువతో సతమతం

మోసం చేశారని కంపెనీపై కేసు

Advertisement
 
Advertisement
Advertisement