నెక్ట్స్‌ డాక్యుమెంట్‌ రైటర్సే..నా? | - | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ డాక్యుమెంట్‌ రైటర్సే..నా?

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

కాజీపేట అర్బన్‌ : వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఈనెల 2వ తేదీన ఏసీబీ దాడుల్లో అక్రమాల చిట్టా బయడపడడంతో సుమారు 18 రోజుల విచారణ తర్వాత 21న ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్ట్‌ తర్వాత డాక్యుమెంట్‌ రైటర్లను అరెస్ట్‌ చేస్తారా.. అంటూ చర్చ నడుస్తోంది. ఇందుకు నిదర్శనం ఏసీబీ దాడుల సమయంలో కార్యాలయంలో 20 మంది డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద నుంచి 70 దస్తావేజులతోపాటు నగదు రూ.47,450 దొరికింది. వారందరినీ విచారించగా తాము సబ్‌ రిజిస్ట్రార్లు వసూలు చేయమంటేనే చేశామని ఒప్పుకున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్ల అరెస్ట్‌తో గుబులు...

వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని సు మారు 126 మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారు. వారిలో ఆ 20 మంది ఎవరు? సబ్‌ రిజిస్ట్రార్ల తర్వాత ఎవరు అరెస్ట్‌ అవుతారనే గుబులుతో కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు తమ కార్యాలయాలను తెరవడం లేదు. ఓ ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా ఆన్‌లైన్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ రూ.42లక్షలు, నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆనంద్‌కు ఎనిమిది రోజుల్లో రూ.16 లక్షల లావాదేవీలు చేసిన డాక్యూమెంట్‌ రైటర్లు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.

తీరు మారేనా..?

సబ్‌ రిజిస్ట్రార్లు అరెస్ట్‌ అయినా కొందరు డాక్యుమెంట్‌ రైటర్ల చేతివాటం మారలేదు. ‘సార్లు ఆఫీస్‌ ఖర్చుల కింద అడుగుతున్నారు.. ఏసీబీ, విజిలెన్స్‌ దాడులు మామూలే.. ఇవ్వాల్సిన మామూళ్లు మాములే’ అంటూ భూక్రయవిక్రయదారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తుండగా.. ఉన్నతాధికారులు పూర్తిస్థాయి సబ్‌ రిజిస్ట్రార్లను నియమించి వరంగల్‌ ఆర్వో తీరు మార్చాలని భూక్రమవిక్రయదారుల కోరుతున్నారు. అయితే.. గతంలో కార్యాలయంలో వసూళ్లకు ప్రైవేట్‌ వ్యక్తులు ఉండగా ప్రస్తుతం ఏసీబీ దాడులతో వారు ఆఫీస్‌లో అడుగుపెట్టడం లేదని సమాచారం.

సబ్‌ రిజిస్ట్రార్ల అరెస్ట్‌తో రిజిస్ట్రేషన్‌

కార్యాలయాల్లో కలకలం

అయినా తీరు మారని డాక్యుమెంట్‌ రైటర్లు

Advertisement
 
Advertisement
Advertisement