కాజీపేట: వాహనాలను జాగ్రత్తగా నడపాలి. మామూలుగానే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక తాగి నడిపితే.. మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే.. తద్వారా తమపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. ఇలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు కల్పిస్తున్న అవగాహన, నిరంతర తనిఖీలు వాహనదారులపై బాగా ప్రభావం చూపుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు చేపడుతున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే ఇక అంతే సంగతులు. పైరవీలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ అధికారులకు ఎవరైనా చెప్పిన వారి నుంచి వచ్చేది సారీ సార్ అని మాత్రమే.
తరచూ పట్టుబడితే మొదటికే మోసం..
ఆరోగ్యానికి మద్యం చేసే చేటు అంతా ఇంతా కా దనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మ ద్యం తాగిన తర్వాత వాహనాలతో రోడ్లపైకి వస్తామంటే మాత్రం ఇకపై కుదరదు. మందు బాబులు వాహనం నడుపుతూ వరుసగా మూడుసార్లు పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు పోలీసులు ఆర్టీఓ అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. ఒకసారి లైసెన్స్ రద్దు చేస్తే మళ్లీ తీసుకోవడం చాలా కష్టం. వాహనదారులతోపాటు రోడ్ల వెంట వెళ్లే వారికి భద్రత కల్పించడం కోసమే ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
గుబులు పుట్టిస్తున్న జైలు శిక్షలు..
వరంగల్ మహానగరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. పర్యాటక ప్రాంతం కావడంతో వారంతాపు సెలవుల్లో అనేక మంది నగరానికి వచ్చిపోతుంటారు. అధిక శాతం కార్లు, వాహనాల్లో వస్తున్నారు. వెంట మద్యం తెచ్చుకోవడం, కొందరు తాగి నడపడంలాంటివి చేస్తున్నారు. దీనివల్ల స్థానికులు, పర్యాటకులకు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి, వీరిని అదుపు చేయడానికి నిత్యం రహదారులపై పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పట్టుకొని సిద్ధంగా ఉంటున్నారు. తాగి వాహనం నడిపిన వారిని పట్టుకుంటున్నారు. ఇటీవల మద్యం తాగి పట్టుబడిన వారిపై న్యాయస్థానాలు కఠిన తీర్పులను వెలువరిస్తున్నాయి. మోతాదుకు మించి మద్యం తాగిన వాహనదారులకు రెండు నుంచి వారం రోజులపాటు జైలు శిక్షలు ఖరారు చేస్తుండడం గమనార్హం. దీనికితోడు ఒక్కొక్కరికి రూ.2వేలకు పైగా జరిమానా విధిస్తున్నారు. నగరంలో సగటున రోజుకు 20 నుంచి 35 కేసుల వరకు నమోదవుతున్నాయి. మోతాదుకు మించి మద్యం తాగినట్లు వెల్లడయ్యితే చాలు కోర్టులు ఇటు జరిమానా, అటు జైలు శిక్ష విధిస్తున్నాయి.
ప్రతిజ్ఞ చేయిస్తున్నారు..
రోడ్డు ప్రమాదాలను వీలైనంతగా తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాగి వాహనాలు నడిపే వారికి పోలీసులు ఎక్కడికక్కడే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వారితో పాటు కుటుంబ స భ్యులను కూడా పిలిపించి వారి ముందే తాగివాహనాలు నడపడంతో వచ్చిన సమస్యల గురించి వివరిస్తున్నారు. ఇంటి వద్ద వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. మరోసారి దొరికితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు.
పట్టుబడితే వాహనదారుల
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
జరిమానాతోపాటు జైలుశిక్ష
విధిస్తున్న కోర్టులు
కౌన్సెలింగ్‌తో అవగాహన కల్పిస్తున్న పోలీసులు


