
వరద ఉధృతి
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి భారీగా వరదలు చేరడంతో నిండుకుండను తలపిస్తూ దిగువకు వెళ్తేంది. వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీలలోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ బ్యారేజీల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో దిగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద చేరుతోంది. ఈ క్రమంలో తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద శుక్రవారం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుండి 7,35,720 క్యూసెక్కుల నీరు చేరుతోంది. బ్యారేజీ వద్ద అన్ని గేట్లు 59 ఎత్తి అదేమోతాదులో దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 83.మీటర్లకుగాను 82.10 మీటర్లుగా నమోదవుతోంది. బ్యారేజీకి ఎగువన గుట్టల గంగారం పరిధిలో ఉన్న జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద ఫేజ్ –1లో రెండు మోటార్లకు గాను 1 మోటారుతోపాటు ఫేజ్ –3లో 6 మోటార్లకుగాను రెండు మోటార్ల ద్వారా 760 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోతల వద్ద ప్రస్తుతం 83 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది.
సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి
భారీగా చేరుతున్న వరద నీరు
● ఎగువ నుంచి
7,35,720 క్యూసెక్కుల నీరు
● బ్యారేజీ వద్ద 59 గేట్లు ఎత్తి
అంతేమొత్తంలో దిగువకు..

వరద ఉధృతి