
24న రైతు చర్చా వేదిక
భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్‌లో నేషనల్ హ్యుమన్‌రైట్స్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఎన్జీఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన రైతు చర్చా వేదిక నిర్వహించనున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఎన్‌జీఓ జాతీయ అధ్యక్షుడు ఐలవేణి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా అధ్యక్షుడు సురేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఐలవేణి శ్రీనివాస్‌తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చర్చా వేదికకు విశిష్ట అతిథిగా సీబీఐ జాయింట్ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రానున్నారని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధించిన అధికారులు, మేధావులు కూడా పాల్గొంటారని చెప్పారు.
ముగిసిన నెట్‌బాల్ పోటీలు
● విజేతలకు బహుమతుల ప్రదానం
జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 8వ సబ్ జూనియర్ బాల బాలికల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికా క్రీడాకారులు హాజరయ్యారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5, మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5 పోటీలు ఈనెల 17న ముగియగా.. చివరగా మిక్స్‌డ్ డబుల్స్ పోటీలతో ముగింపు పలికారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మహబూబ్‌నగర్(విన్నర్), కామారెడ్డి(రన్నర్), థర్డ్ ప్లేస్‌లో వరంగల్/నాగర్ కర్నూల్ సంయుక్త విజేతలుగా నిలువగా, మూడు కేటగిరీల్లో విజయం సాధించిన టీంలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.