
సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే(ఫైల్)
సాక్షి, మహబూబాబాద్: మానుకోటలో ఎన్నికల సందడి నెలకొంది. అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల రిహార్సల్స్ కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో ఉంది. ఈమేరకు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ సమ్మేళనాల ద్వారా పలు విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు.
ఊపందుకున్న సమ్మేళనాలు..
ప్రతి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అలాగే డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల మండలాల్లో ఇప్పటికే జెడ్పీచైర్‌పర్సన్ బిందు కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్‌లో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బయ్యారం, గార్ల మండలాల్లో నిర్వహించే సభల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ములుగు నియోజకవర్గంలో కూడా మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తున్నారు.
అంతర్గత విభేదాలు బట్టబయలు..
ఆత్మీయ సమ్మేళనాలు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాలోని కొన్ని మండలాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల మధ్య విభేధాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో వర్గపోరు ఉంది. కాగా అందరిని కలుపుకొనిపోవాలని అధినాయకత్వం నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ.. వర్గపోరుతో ఎమ్మెల్యేలు తమ వ్యతిరేక వర్గాలకు చెందిన నాయకులను పిలువడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలో ఇంతకాలంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు కూడా కార్యకర్తలు చెబుతున్నారు. ఇంతటితో ఆగకుండా ఇంతకాలం పార్టీలో పనిచేసిన తమకు ప్రాధాన్యత లేదని పలువురు కార్యకర్తలు కూడా వాపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పార్టీలోని అంతర్గత విభేదాలు బట్టబయలు అవుతున్నాయని కార్యకర్తలు చెబుతున్నారు.
అధినాయకత్వం ఆరా..
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలపై బీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం పూర్తిస్థాయిలో ఆరా తీస్తుందని ప్రచారం. ప్రతి సమ్మేళనానికి వచ్చే నాయకులు ఎవరు.. రానివారు ఎవరూ.. ఎందుకు రాలేదు.. ఎందుకు పిలువలేదు.. వచ్చిన వారిలో ఎవరు ఏం మాట్లాడారు.. ఇలా అన్ని విషయాలపై నివేదిక తీసుకుంటున్నట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యే విషయంలో స్థానిక నాయకులు ఎలా ఉన్నారు. ఇందులో ఆత్మీయులు ఎవరు... వ్యతిరేకులు ఎవరూ అనేది తెలిసిపోతుంది. మొత్తంగా ఆ నియోజకవర్గంలో పార్టీ, నాయకుడి పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ సమ్మేళనాలు దోహపడతున్నాయి. ఈక్రమంలో చిన్న చిన్న మనస్పర్థలతో దూరంగా ఉన్నవారిని బుజ్జగించడం, ప్రజలు ఏ విషయంపై వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకొని. ఎన్నికల నాటికి సరిదిద్దే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు.