నీడ, నీరు కరువే.. | - | Sakshi
Sakshi News home page

నీడ, నీరు కరువే..

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఏప్రిల్‌ నెల మొదటి పక్షంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మే నెలలో ఎండలు, వడగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. గత మూడు నాలుగేళ్లతో పోలిస్తే ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా ఈ సమయంలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే 2–3 డిగ్రీలకు పైగా అధికంగా అంటే 43 డిగ్రీల వరకు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పటికే నంద్యాల రూరల్‌, కౌతాళం, ఆళ్లగడ్డ, ఆలూరు, కర్నూలు, కల్లూరు, రుద్రవరం, దొర్నిపాడు తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ 15 నుంచి ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల చివరిలోపు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, మే నెలలో 45–47 డిగ్రీలకు చేరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల బెడద తీవ్రతరమవుతున్నా ఉపాధి కూలీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

‘ఉపశమనం’ కాగితాల్లోనే!

● పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు సురక్షిత మంచి నీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 1న ఆదేశించింది.

● ప్రతి గంటకు నీటిని తాగే విధంగా వాటర్‌ బెల్‌ పద్ధతిని అమలు చేయాలి.

● గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే తాటాకు 8, ఈతాకు తదితరాలతో పని ప్రదేశంలో పందిళ్లు వేయాలి.

● ఉపాధి కూలీలకు ప్రథమ చికిత్స సామాగ్రిని(ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌) పని ప్రదేశంలో సిద్ధంగా ఉంచాలి.

● ఆరోగ్య శాఖ సహకారంతో పని ప్రదేశాల్లో ఏఎన్‌ఎం సేవలను ఉపయోగించుకోవాలి.

●ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

●ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి వెళ్లి 11 గంటలకు ఇళ్లకు చేరుకోవాలి.

● అవసరమైతే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తిరిగి పని కొనసాగించాలి.

ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు

● జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాలి.

● ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 16శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది.

● అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రతకు కారణమవుతోంది.

● ఈసారి ఎల్‌నినో ప్రభావం కూడా భయపెడుతోంది. మామూలుగా వేసవి మే నెల చివరితో ముగుస్తుంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో సారి ఆగస్టు వరకు ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగనుంది.

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇలా..

గత వైఎసార్‌సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లూ ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో వేసవి ఉపశమన చర్యలు పక్కాగా అమలయ్యాయి. అప్పటి ప్రభుత్వం ఎండల నుంచి రక్షణ కల్పించేందుకు షేడ్‌ సరఫరా చేసింది. షేడ్స్‌ కింద నీళ్లు తాగి కొద్ది సేపు సేదతీరడం, భోజనం చేయడం జరిగింది. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం విశేషం.

ప్రస్తుతం ఉపాధి పనులకు కర్నూలు జిల్లాలో 28వేలు, నంద్యాల జిల్లాలో 24వేల మందికి పైగా కూలీలు హాజరవుతున్నారు. నిప్పుల కొలిమిని తలపించే ఎండల్లో పనులు చేస్తున్నప్పటికీ ఉపశమన చర్యలు లేకపోవడం గమనార్హం. ఉదయం 9 గంటలకే వడగాలుల తీవ్రత పెరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పటైన తర్వాత 2025లో ఉపాధి కూలీల కోసం షేడ్స్‌ సరఫరా చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో ఎక్కడా పని ప్రదేశంలో నీటి సదుపాయం కల్పిస్తున్న దాఖలాలే లేవు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల జాడే లేకుండాపోవడం గమనార్హం. ఉపాధి కూలీలకు నీడ సదుపాయం వెతికినా కనిపించదు. వాటర్‌బెల్‌ పాటించకపోవడం కూలీల ప్రాణం తీస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement