వృద్ధ దంపతుల భూరి విరాళం
కర్నూలు జిల్లా: జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు సమీపంలోని మాధవరం గ్రామంలో సీతారాముల దేవాలయానికి భూరి విరాళం ఇచ్చారు. జలదుర్గం రెవెన్యూ పరిధిలో తమ పేరిట ఉన్న రూ. 2 కోట్ల విలువ చేసే 8 ఎకరాల తోటను సోమవారం ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాముల వారి దేవాలయానికి రిజిస్టర్ చేసి ఇచ్చారు. సంతానం లేని తమకు రాములోరే దిక్కు అని భావించిన ఈ దంపతులు తమ ఆస్తిని ఆలయానికి ధారాదత్తం చేసి ఆదర్శంగా నిలిచా రు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి మాధవరం గ్రామస్తులు వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులను గ్రామ పురవీధుల మీదుగా మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. వృద్ధ దంపతులకు అడుగడుగునా నీరాజనం పలుకుతూ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని రాముల దేవాలయంలో వృద్ధ దంపతులను ఘనంగా సన్మానించి సీతారాముల దర్శనం చేయించారు. అనంతరం మాధవరం గ్రామస్తులు మాట్లాడుతూ వృద్ధ దంపతులకు తామెంతో రుణపడి ఉంటామని, వారికి ఏ కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


