కౌశల్ క్విజ్ పోటీలకు వేళాయె!
● దరఖాస్తుకు నేడు తుది గడువు
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పట్ల ఆసక్తి పెంపొందించేందుకు 2025 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ (కౌశల్ క్విజ్) పోటీలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తుంటాయి. వాటిలో భారతీయ విజ్ఞాన మండలి(బీవీఎం), ఆంధ్రప్ర దేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఏపీకాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జరిపే కౌశల్ క్విజ్ పోటీలు ఒకటి. వీటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పిల్లల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని తెలుసుని, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యం. కౌశల్ సైన్స్ 2025 పరీక్ష దరఖాస్తుకు నేటి (ఈనెల 26వ తేదీ)తో గడువు ముగుస్తోంది.
అర్హులు: అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.
రిజిస్ట్రేషన్ ఇలా: తొలుత అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ సబ్జెక్టుల టీచర్ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఈనెల 26వ తేదీ లోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీవీఎంఏపీ.ఓఆర్‌జీల రిజిస్ట్రేషన్ చేయాలి.
పరీక్ష ఇలా: కౌశల్ సైన్స్ క్విజ్ ప్రాథమిక స్థాయి ఆన్‌లైన్ పరీక్షను నవంబర్ 1న 8వ తరగతికి, 3న తొమ్మిదో తరగతికి, 4న 10వ తరగతికి నిర్వహిస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి 8, 9 తరగతులకు నవంబర్ 27న, 10వ తరగతికి 28న జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీల తేదీని తర్వాత ప్రకటిస్తారు. మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్, డెస్క్‌టాప్ ద్వారా రాయవచ్చు.
మరిన్ని వివరాలకు: జిల్లా కో ఆర్డినేటర్ కేవీ సుబ్బారెడ్డి 9948605546 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
బహుమతులు: జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.7,500, ద్వితీయ బహుమతిగా రూ.6వేలు, తృతీయ బహుమతిగా రూ.4,500, కన్సోలేషన్ బహుమతుల కింద రూ.3 వేలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతులుగా రూ.6 వేల వంతున ప్రదానం చేస్తారు.


