ఉద్యమాలతో కార్మికుల బతుకుల్లో మార్పులు
● సీఐటీయూ 13వ
జిల్లా మహాసభలు ప్రారంభం
కర్నూలు(సెంట్రల్): ఉద్యమాలతోనే కార్మికుల బతుకల్లో మార్పులు వస్తాయని, ఉద్యమాలకు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత సీఐటీయూపై ఉందని మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. శనివారం కార్మిక, కర్షక భవన్‌లో సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సీఐటీయూ జెండా ను మెడికల్ రెప్స్ యూనియన్ నాయకులు, సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు సీఐటీ యూ జెండా ఔన్నత్యంపై గేయాలను ఆలపించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందుగా సీఐటీయూ విస్తరణ కోసం విశేష కృషి చేసిన నాయకులు బి.రాజగోపాల్, బి.మహానందరెడ్డి, జేఎన్‌శేషయ్యల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు పీఎస్ రాధాకృష్ణ, పి.నిర్మల, ఈరన్న అధ్యక్షత వహించగా ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక వ్యతరేకమన్నారు. కార్మికుల 8 గంటల పని విధానాన్ని మోదీ 10–13 గంటల వరకు పెంచారన్నారు. లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మిక చట్టాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బి.రామాంజనేయులు, నారాయణస్వామి, ప్రభాకర్, సాయిబాబా, విజయరామాంజనేయులు, ఉమాదేవి, రఘుబాబు, దివాకర్, నరసింహులు, అబ్దుల్‌దేశాయ్, పీఎస్ గోపాల్, రాముడు, మధు పాల్గొన్నారు.


