వంతెనను ఢీకొని లారీ డ్రైవర్ మృతి
● ఘాట్ రోడ్డులో ఆరు గంటలు
ట్రాఫిక్ జామ్
మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్‌రోడ్డులో శనివారం ఉదయం పురాతన రైల్వే వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నంద్యాల వైపు నుంచి గిద్దలూరుకు మొక్కజొన్న ధాన్యం బస్తాలతో వెళుతున్న లారీ మార్గమధ్యలో బొగద వంతెన దాటిన తర్వాత ఉన్న పురాతన రైల్వే వంతెనను ఢీకొంది. భారీ మలుపు ఉండటంతో పాటు ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన డ్రైవర్ బాలహుసేని(50) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో గిద్దలూరు వైపు నుంచి నంద్యాల, నంద్యాల వైపు నుంచి గిద్దలూరు, విజయవాడ వెళ్లే వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, బైకులు మాత్రమే వెళుతుండగా లారీలు, బస్సులు అధిక సంఖ్యలో ఇరువైపులా ఆగిపోయాయి. అరటికాయలతో వెళుతున్న వాహనాలతో పాటు ఇతర వాహనాల రాకపోకలు కష్టంగా మారింది. సుమారు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న గిద్దలూరు పోలీసులు క్రేన్ల సాయంతో రోడ్డుకు అడ్డుగా ఉన్న లారీని తప్పించడంతో యథావిధిగా వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాద ఘటన గిద్దలూరు పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


