
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం!
కర్నూలు: డిజిటల్ అరెస్ట్ పేరుతో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించి రూ.8.40 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. వాట్సప్‌లో ఫేక్ వారెంట్ పంపి రెండు రోజుల పాటు ఎవరికీ చెప్పనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకున్నారని, విచారణ జరిపి రికవరీ చేయాలని ఆయన ఎస్పీని వేడుకున్నారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 81 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా పాల్గొని వినతులను స్వీకరించారు.
చిప్పగిరిలో కుండపోత వర్షం
● చిప్పగిరిలో 99.8 మి.మీ
వర్షపాతం నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు కురిశాయి. చిప్పగిరిలో రికార్డు స్థాయిలో 99.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లా సగటున 5.1 మి.మీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 106.4 మి.మీ వర్షం కురిసింది. కాగా అధిక వర్షాల వల్ల చిప్పగిరి, ఆదోని, కౌతాళం, తుగ్గలి, మద్దికెర మండలాల్లో పంటలకు భారీగా నష్టం జరిగింది. 1431 మంది రైతులు 1160 హెక్టార్లలో పంటలను నష్టపోయినట్లు వ్యవసాయ యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది.
ఎట్టకేలకు డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్టు విడుదల
● మిగిలిపోనున్న 88 పోస్టులు
కర్నూలు సిటీ: నిరుద్యోగ అభ్యర్థులను ఊరించిన డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్టు ఎట్టకేలకు సోమవారం విడుదలైంది. డీఎస్సీ ప్రకటన జారీ చేసినప్పటి నుంచి అనేక వివాదాలు, ఆందోళనల మధ్య ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యలో 2,645, ఆశ్రమ పాఠశాలల్లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అయితే సర్టిఫికెట్ల పరిశీలనలో 2,590 పోస్టులకు మాత్రమే అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వనున్నట్లు ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 88 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగాలకు ఎంపికై న వారందరూ గత నెలలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న సెంటర్లకు 18వ తేదీ ఉదయం 7 గంటలకు రిపోర్టు చేసుకోవాలని, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అభ్యర్థులతో పాటు ఒకరు సహాయకులుగా విజయవాడకు బయలుదేరి వెళ్లాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ప్రకటన జారీ చేశారు.