
మరోసారి వివాదంలో కర్నూలు తాలూకా పీఎస్
● ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి వసూళ్లకు పాల్పడిన ముఠా సభ్యులకు సహకరించి ఇటీవలనే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు సస్పెన్షన్‌కు గురయ్యారు.
● వారం రోజుల వ్యవధిలోనే అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచలింగాల గ్రామం కేంద్రంగా గంజాయి వ్యాపారం సాగుతున్నట్లు వెలుగు చూడటంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
● గతంలో తనిఖీల్లో పట్టుబడిన 105 కిలోల వెండి ఇదే స్టేషన్‌లో భద్రపర్చగా ముగ్గురు సిబ్బంది కాజేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ కేసులో అప్పటి సీఐపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
● తమిళనాడుకు చెందిన వ్యాపారి వద్ద చెక్‌పోస్టు తనిఖీల్లో రూ.96 లక్షలు నగదు పట్టుబడగా అతనితో బేరాలు కుదుర్చుకుని గతంలో పనిచేసిన ఓ సీఐ రూ.12 లక్షలు మామూళ్లు దండుకున్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పట్లో పనిచేసిన సీఐపై కేసు నమోదై శాఖాపరమైన చర్యలకు గురయ్యారు.
● చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారికి సహకరించి గతంలో నలుగురు సిబ్బంది ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై జిల్లా సరిహద్దు స్టేషన్లకు బదిలీ అయ్యారు.
● స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది అక్రమ కార్యకలాపాలపై ప్రతి సంవత్సరం సస్పెన్షన్ వేటు పడుతుండగా.. గంజాయి దందాతో మరోసారి తాలూకా పోలీస్ స్టేషన్ చర్చనీయాంశంగా మారింది.