రైతుల పాలిట వరం.. ఉచిత విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

రైతుల పాలిట వరం.. ఉచిత విద్యుత్‌

Jul 8 2025 5:18 AM | Updated on Jul 8 2025 8:47 AM

-

వైఎస్సార్‌.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రతిహృదయం పులకిస్తోంది. ప్రగతి స్వాప్నికుడు.. సంక్షేమ రథసారథి.. ప్రజలే ప్రాణంగా సాగించిన ప్రయాణంలో దూరమై 16 ఏళ్లు గడిచినా ప్రతి మదిలో రాజన్న స్థానం పదిలం. ఆయన పాలనలో ప్రతి ఇంటి ముంగిటా అభివృద్ధి వెలుగులే. ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే. బీడు బారిన నేల తల్లికి జల సిరులందించిన అపరభగీరథుడిలా.. దగాపడిన బడుగు జీవికి అభయహస్తమందించి.. లయ తప్పిన పేద గుండెకు ఊపిరులూదిన దైవంలా.. ఆసరా లేని వృద్ధాప్యానికి పెద్ద కొడుకుగా భరోసానిచ్చి.. ఆరుగాలం కష్టించినా ఉరితాడే దిక్కయిన పేద రైతు కష్టాలు ఒక్క సంతకంతో మాఫీ చేసిన‘మహా నేత’.. తెలుగుదనానికి నిలువెత్తు రూపమే వైఎస్సార్‌. అప్పట్లో అభివృద్ధి ఫలాలు పొందిన ప్రతి గుండె ఆ మహానేతను మనసారా స్మరిస్తోంది. నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

రైతుల పాలిట వరం.. ఉచిత విద్యుత్‌ 
2004 సంవత్సరానికి ముందు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నాటి పాలకులే వ్యవసాయం దండగని ప్రకటించడంతో రైతులకు చేయూత కరువైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌లు 1.15 లక్షలు ఉండగా.. ఆయన మరణించే నాటికి 1,56,790 కనెక్షన్‌లకు చేరుకున్నాయి. అప్పట్లోనే ఉచిత విద్యుత్‌ ద్వారా రైతులకు ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం లభించింది. మొట్ట మొదట ఇటు రైతులు, అటు పొదుపు మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇచ్చే విధానాన్ని తెచ్చారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 3.25 లక్షల మంది పొదుపు మహిళలకు లబ్ధి చేకూరింది.

వ్యవసాయ కూలీలు రైతులయ్యారు
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన భూపంపిణీ కార్యక్రమం వల్ల కూలీలు రైతులయ్యారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది రైతులకు 1.35 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లో ఉపాధిహామీ పథకం కింద డ్రైల్యాండ్‌ హార్ట్టికల్చర్‌ పేరుతో పండ్లతోటల పెంపకాన్ని చేపట్టి వారికి శాశ్వత ఆదాయ వనరులను సృష్టించారు. 2007లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో కలసి ఓర్వకల్‌ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఉపాధి నిధులతో 2007–08, 2008–09 సంవత్సరాల్లో డ్రైల్యాండ్‌ హార్టికల్చర్‌ కింద 9వేల ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేశారు. నాడు వ్యవసాయ కూలీలుగా ఉన్న వారు భూపంపిణీ కార్యక్రమంతో రైతులుగా మారారు. ఉపాధి నిధులతో ఈ భూముల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసుకున్నారు.

రూ.15వేల కోట్ల రుణమాఫీ
ౖవైఎస్సార్‌ హయాంలో విజయవంతంగా రుణమాఫీ చేయడం విశేషం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయించారు. ఉమ్మడి జిల్లాలో 2.75 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.15వేల కోట్లు మాఫీ అయ్యాయి. సక్రమంగా రుణాలు చెల్లించడం వల్ల మాఫీ వర్తించని రైతులకు ప్రోత్సాహకాల కింద రూ.5వేల ప్రకారం చెల్లించారు.

● ఇందిరమ్మ ఇళ్ల పేరుతో హౌసింగ్‌లో సరికొత్త విప్లవం తెచ్చారు. వైఎస్సార్‌ హయాంలో నాలుగు దశల్లో ఉమ్మడి జిల్లాలో 3.25 లక్షల ఇళ్లు నిర్మించారు. వైఎస్సార్‌ హయాంలోనే కొత్త ఊళ్లు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement