
ఓర్వకల్లును పారిశ్రామికంగా తీర్చిదిద్దుతాం
ఓర్వకల్లు: ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం మండలంలోని గుట్టపాడు గ్రామం వద్ద రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎంఎస్‌ఎంఈ పార్కును ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ సరైన శిక్షణ, చదువు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే ఓర్వకల్లులో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ త్వరగా మంచి సంపాదన ఉంటుందని, యువత పైలెట్ కోర్సుల వైపు ఆసక్తి చూపాలని సూచించారు. ఈ పార్కుకు అవసరమైన దూపాడు నుంచి ఓర్వకల్లు మీదుగా బేతంచెర్ల వరకు రైల్వే లైనింగ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయన్నారు. ఇండస్ట్రీయల్ హబ్ కోసం ఏర్పాటు చేస్తున్న నీటి సౌలభ్యం పనులు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్న తరహా పరిశ్రమల పార్కులు, స్టార్టప్‌లు ఎవరైతే ఎంఎస్‌ఎంఈలుగా మారాలనుకున్నారో, వారందరికీ అవకాశం కల్పించేందుకు గాను 7 నియోజకవర్గాల్లో భూమిని గుర్తించామన్నారు. ప్రస్తుతం మొట్టమొదటి సారిగా జిల్లాలోని ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు వద్ద ప్రారంభించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, ఆర్‌డీఓ సందీప్‌కుమార్, మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారురాలు విజయభారతి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం అరుణకుమారి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.