
ముందే వచ్చిన వర్షాకాలం!
● జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు ● గూడూరులో 49.2 మిమీ వర్షపాతం నమోదు ● తగ్గిన ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ సారి వానాకాలం ముందే వచ్చినట్లుంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హాలహర్వి, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. గూడూరులో అత్యధికంగా 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరులో 47.6, కల్లూరులో 38.8, హొళగుందలో 19.4, గోనెగండ్లలో 16.4, సీ.బెళగల్‌లో 13.4, కౌతాళంలో 12.6, ఓర్వకల్లులో 12.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెలకు సంబంధించి 21వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 27.2 మి.మీ ఉండగా... 77.9 మి.మీ వర్షపాతం నమోదైంది. హంద్రీకి ఒక మోస్తరుగా నీరు వచ్చింది. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గరిష్టంగా 36 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
17 వేల క్యూసెక్కుల వరదనీరు
సి.బెళగల్: కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో దాదాపు 17 వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నది పూర్తి స్థాయిలో రెండు దడులను తాకుతూ వరదనీరు ప్రవహిస్తుండటంతో నదికి జలకళ సంతరించుకుంది. కాగా మండల పరిధిలోని తుంగభద్ర తీర ప్రాంత గ్రామాల్లో రైతులు ముందస్తు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఆర్డీఎస్ జళకళ
కోసిగి: మండలంలోని కందుకూరు గ్రామ సమీపంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టపై తుంగభద్ర నది జళకళ సంతరించుకుంది. మండలంతో పాటు నదితీర పై ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వర్షపు నీరు నదికి చేరుకున్నాయి. దీంతో ఆర్డీఎస్ ఆనకట్టపై రెండు అడుగుల మేర ఎత్తులో ఎక్కి దిగువ ప్రాంతం కర్నూలు వైపు ప్రవహిస్తోంది. ముందస్తు వర్షాలు కురిసి నది పుష్కలంగా ప్రవహించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.