
ఈ–శ్రమ్ కార్డులపై అవగాహన అవసరం
కర్నూలు (అర్బన్): ఈ–శ్రమ్ కార్డులపై కార్మికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. సోమవారం న్యాయ సేవా సదన్‌లో ఆశా వర్కర్లకు ఈ–శ్రమ్ కార్డులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు వెంకటహరినాథ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతికళ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి ఈ–శ్రమ్ కార్డు అందేలా కృషి చేయాలన్నారు. ఈ–శ్రమ్ కార్డుల వల్ల లభించే ఉపయోగాలను ప్రతి కార్మికుడికి తెలియజేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ శాంతికళ మాట్లాడుతూ తమ డిపార్ట్‌మెంట్‌లో ఆశా వర్కర్లందరూ ఈ–శ్రమ్ కార్డులు పొందారని తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆశా వర్కర్లకు ఈ–శ్రమ్ కార్డులు పోర్టల్‌లో ఎలా నమోదు చేయాలో వివరించారు. కార్డులు పొందిన వారికి ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికునికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద బీమా ఉచితంగా కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్‌మెంట్ లీగల్ ఆఫీసర్ సుమలత పాల్గొన్నారు.