సమయం లేదు మిత్రమా! | - | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా!

May 5 2025 8:46 AM | Updated on May 5 2025 8:46 AM

సమయం

సమయం లేదు మిత్రమా!

రిజిస్ట్రేషన్లలో టైమ్‌ స్లాట్‌

బుక్‌ చేసుకున్న స్లాట్‌ సమయానికి

వెళ్లకపోతే అంతే సంగతులు

అదనంగా రూ.200 చెల్లించి

మరోస్లాట్‌ బుక్‌ చేసుకోవాలి

ఇబ్బంది పడుతున్న క్రయ,

విక్రయదారులు

కర్నూలు(సెంట్రల్‌): స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైమ్‌ స్లాట్‌ విధానంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రోజులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా రిజిస్ట్రేషన్‌ చేసేవారు. ఒకనొక సమయంలో సిబ్బంది రాత్రిళ్లు ఉండి నూరు డాక్యుమెంట్లకుపైగా రిజిస్ట్రేషన్లను జరిపే వారు. నూతన విధానంతో ఎస్‌ఆర్‌ఓల్లో (సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో) రోజుకు కేవలం 39, ఆర్‌ఓ కార్యాలయంలో 78 స్లాట్‌లే బుకింగ్‌ అవుతున్నాయి. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్‌ పని మీద వచ్చిన వారు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

అన్‌లిమిటెడ్‌ నుంచి లిమిటెడ్‌కు...

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 22 ఎస్‌ఆర్‌ఓ, కర్నూలు, నంద్యాల ఆర్‌ఓ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో కర్నూలు, నంద్యాల, ఆదోని, కల్లూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలాయల్లో రోజులో ఎన్ని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లైనా జరిగేవి. ఒకనొక రోజులో 100కు పైగా డాక్యుమెంట్లు జరిగేవి. డాక్యుమెంట్‌ ఉంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైం స్లాట్‌తో అనేక అవస్థలు ఉన్నాయి. వాటిని సరిచేయకపోతే క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడాల్సిందే. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ సంఖ్య టైమ్‌ స్లాట్‌తో బాగా తగ్గిపోతోంది. గతంలో అన్‌లిమిటెడ్‌గా జరిగే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నూతన విధానంలో లిమిటెడ్‌గా మారిపోయింది. ఇప్పుడు రోజులో సబ్‌ రిజిస్ట్ట్రార్‌ కార్యాలయం(ఎస్‌ఆర్‌ఓ)లో అయితే కేవలం 39, ఆర్‌ఓ కార్యాలాయల్లో అయితే 78 డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయడానికి టైమ్‌ స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందిగా మారింది. వారు మరుసటి రోజు ఉండే టైం స్లాట్లను బుక్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఆ రోజు కూడా ఆన్‌లైన్‌ సైట్‌ పనిచేయకపోతే వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రెండో సారి స్లాట్‌బుక్‌ చేసుకుంటే

రూ.200 వసూలు

ఒకసారి రిజిస్ట్రేషన్‌ కోసం టైం స్లాట్‌ను బుక్‌ చేసుకుంటే కచ్చితంగా అదే సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి ఇచ్చిన 10 నిమిషాల సమయంలో వెళ్లకపోతే ఆ స్లాట్‌ ముగిసిపోతుంది. వారు మళ్లీ స్లాట్‌ను బుక్‌ చేసుకోవాలంటే అదనంగా రెండో సారి అయితే రూ.200, మూడోసారి అయితే రూ.500 చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. ఫలితంగా విక్రయదారులపై మరింత ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే పెరిగిన రిజిస్ట్రేషన్‌ చార్జీలు, డాక్యుమెంట్‌ రైటర్ల ఫీజు, చలానాల మొత్తాలతో వినియోగదారులపై తీవ్ర రుణ భారం పడుతోంది.

గతంలో ఎప్పుడైనా అందుబాటులో

టైం స్లాట్‌

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో టైం స్లాట్‌ విధానం 2020 నుంచే వినియోగదారులకు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో క్రయ, విక్రయదారులే తమ డాక్యుమెంట్‌ను తయారు చేసుకొని వారికి అనువైన సమయంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లేలో పీడీఈ(పబ్లిక్‌ డేటా ఎంట్రీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతనంగా టైం స్లాట్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఎప్పుడైనా టైం స్లాట్‌లు బుక్‌ చేసుకునే అవకాశం ఉండగా..ప్రస్తుతం వాటిని కుదించారు. దీంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు.

చాలా ఇబ్బందిగా ఉంది

టైమ్‌స్లాట్‌ విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గతంలోనూ స్లాట్‌లు అన్‌లిమిటెడ్‌గా బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం లిమిటెడ్‌ చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వారికి ఇబ్బంది మారింది. ప్రభుత్వం పునరాలోచనచేయాల్సిన అవసరం ఉంది.

– చంద్రశేఖర్‌, డాక్యుమెంట్‌ రైటర్‌

సమయం లేదు మిత్రమా!1
1/1

సమయం లేదు మిత్రమా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement