కర్నూలు(అగ్రికల్చర్)/సి.బెళగల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వడగండ్లతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. దీంతో పలు గ్రామాల్లో దాదాపు గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వడగండ్ల వానలతోపాటు గాలి తీవ్రత ఉండటంతో పలుచోట్ల మామాడితోటల్లో కాయలు నేలరాలాయి. చాలా చోట్ల రాళ్లతో కొట్టినట్లుగా వర్షం కురిసింది. సి.బెళగల్‌తో పాటు కంబదహాల్, కృష్ణదొడ్డి, వెల్దుర్తి, ఆస్పరి మండలంలో చిన్నహోతూరులో భారీ చినుకులలో వడగండ్లు కురిశాయి. వర్షాలతో భానుడి భగభగలు కొద్దిగా తగ్గడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊరట పొందారు. ఆది, సోమవారాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.