● నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ● జిల్లాలో 172 కేంద్రాలు ఏర్పాటు ● పరీక్షలకు హాజరుకానున్న 40,776 మంది విద్యార్థులు ● సమస్యాత్మకమైన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
కర్నూలు సిటీ: పాఠశాల విద్యలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిషు మీడియం, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో విద్యార్థులు మొదటిసారి పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 40,776 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 31,410 మంది, ప్రైవేటు 7,038 మంది, ఓపెన్ టెన్త్ విద్యార్థులు 2,328 మంది హాజరుకానున్నారు. ఇందులో 23,486 మంది ఇంగ్లిషు మీడియం, 5,068 మంది తెలుగు, 379 మంది ఉర్దూ, 477 మంది కన్నడ మీడియంలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గత ప్రభుత్వం మన బడి నాడు–నేడు కింద అన్ని రకాల వసతులు కల్పించడంతో సదుపాయాల కొరత తీరింది. రెగ్యులర్ టెన్త్‌తో పాటు, ఒపెన్ స్కూల్ పది పరీక్షలు సైతం ఒకే సమయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 172 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 172 మంది ముఖ్య పర్యవేక్షకులను, 172 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 1,840 మంది ఇన్విజిలెటర్లను, సీ సెంటర్లకు 11 మంది కస్టోడియన్స్, 7 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లోని గార్గేయపురం జెడ్పీ హైస్కూల్, రామళ్లకోట జెడ్పీ హైస్కూల్, ఉల్చాల జడ్పీ హైస్కూల్, ఆస్పరి జడ్పీ హైస్కూల్ ఏ సెంటర్, బీ సెంటర్, ఏపీ మోడల్ స్కూల్ గాజులదిన్నెలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఆల్ ది బెస్ట్
ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టు పదవ తరగతి. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు పాజిటివ్ ఆలోచనతో పరీక్షలు రాయాలి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేయాలి. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి.
– పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్
పకడ్బందీగా ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మాప్ కాపీయింగ్‌కు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు ఉంటాయి. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించారు. కేంద్రా ల్లోకి ఎలాంటి సెల్‌ఫోన్లు అనుమతించం. పరీక్షల్లో ఏవైన సమస్యలు తలెత్తినా, సందేహాలు ఉన్నా డీఈఓ ఆఫీస్‌లో కంట్రోల్ రూం నంబర్ 98855716544ను సంప్రదించవచ్చు.
– ఎస్.శామ్యూల్ పాల్, డీఈఓ