నంద్యాల(అర్బన్): స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని జూనియర్ కళాశాల గిరిజన బాలికల వసతి గృహం విద్యార్థినులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉన్నట్టుండి హాస్టల్ రెండో అంతస్తు కిటికి దిమ్మె విరిగి కింద పడింది. అయితే, ఆ సమయంలో విద్యార్థినులంతా బయట వరండాలో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉండటంతో ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పలు గదులు పెచ్చులూడి వర్షానికి కారుతున్నాయని విద్యార్థినులు వాపోయారు. ప్రమాదం జరగకముందే అధికారులు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.