రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Mar 16 2025 1:20 AM | Updated on Mar 16 2025 1:18 AM

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను అందజేయవచ్చన్నారు. సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

చేపల పెంపకంతో స్వయం ఉపాధి

కర్నూలు(అగ్రికల్చర్‌): స్వయం ఉపాధిలో రాణించేందుకు చేపల పెంపకం చక్కటి అవకాశమని మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌నాయక్‌ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు, సుంకేసుల డ్యామ్‌, గాజులదిన్నె ప్రాజెక్టుల్లో పర్యటించారు. కర్నూలు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. జిల్లా ప్రగతిని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామల కమిషనర్‌కు వివరించారు. కర్నూలు పాత బస్టాండు సమీపంలోని చేపల మార్కెట్‌ను తనిఖీ చేశారు. బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రం(ఐఎఫ్‌టీసీ)లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నేడు మార్కెట్‌లో చేపలకు విశేషమైన డిమాండ్‌ ఉందని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పొదుపు మహిళల అనుసంధానంతో చేపల ఉత్పత్తిని పెంచడం, వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లుగా పేర్కొన్నారు.

బోధనలో ఇంటి వాతావరణం కల్పించాలి

కల్లూరు: పాఠశాలలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఇంటి వాతావరణంలో ఉన్నట్లుగా బోధన చేయాలని డీఈఓ శామ్యూల్‌పాల్‌ సూచించారు. శనివారం కల్లూరు మండలం పెద్దపాడు ఏపీ మోడల్‌ స్కూల్‌లో సమగ్ర శిక్ష ద్వారా కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు, ఎన్‌ఎమ్‌లు, పీఈటీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురి కాకుండా ఉపాధ్యాయులు సూచనలివ్వాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర ఏపీసీ శ్రీనివాసులు, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు.

రైతుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు

పత్తికొండ రూరల్‌: టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న రైతుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం స్థానిక చదువుల రామయ్య భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఇక్కడి పాలకుల ఉదాసీన వైఖరి వల్ల టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌గా మార్చారన్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ను వ్యాపార దృక్పథంతోగాకుండా రైతుల ప్రయోజనార్థం విస్తృతం చేసి, అందులో రైతులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్రకుమార్‌, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఉమాపతి, కారన్న, నెట్టికంటయ్య పాల్గొన్నారు.

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  1
1/1

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement