● జొహరాపురం గ్రామానికి ఒక్కిరేణి నీరే దిక్కు ● పిల్లల నుంచి పెద్దల వరకు తప్పని అవస్థలు ● పిలిచినా ఊరికి రాని బంధువులు
ఒక్కిరేణిలో నీరు తీసుకెళ్తున్న గ్రామస్తులు
ఆస్పరి: ఎండలు మండుతూ దాహం వేసినా చుక్క నీరు తాగలేని దుస్థితి వారిది. మంచినీరు కావాలంటే దూరం వెళ్లాలి. అక్కడ వేల మంది జనం.. చాలా కష్టం పడితేనే బిందె నీరు దొరుకుతుంది. ఇంట్లో ఉండే మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను తమతోపాటు తప్పని తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఆస్పరి మండలంలోని జొహరాపురం ప్ర‘జల’ కష్టాలు ఇవీ.. గ్రామంలో 1,200 ఇళ్లు ఉండగా 7,000 మంది నివాసం ఉంటున్నారు. యాభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం జొహరాపురానికి 50 కిలో మీటర్లు దూరంలో ఉన్న బాపురం రిజర్వాయర్ నుంచి మంచి నీటి సరఫరా చేసేందుకు పైపులైన్ వేసింది. అయితే పై గ్రామాలైన ఆలూరు, మొలగలవల్లి, కొట్టాల గ్రామాల వారు నీటి అవసరాలు తీర్చుకున్న తరువాతే జొహరాపురం గ్రామానికి బాపురం రిజర్వాయర్ నీరు వస్తుంది. అది కూడా ప్రతి ఒక్క కాలనీకి నీటిని సరఫరా చేయరు. దీంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో గ్రామ సమీపంలో కలుషితంగా ఉన్న ఒక్కిరేణి నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. కొందరు జ్వరం, విరేచనాలు, నొప్పులు ఎక్కువై అస్పత్రుల పాలవుతున్నారు. ఒక్కిరేణిలో నీరు లేకపోతే ఆలూరు, ఆస్పరి నుంచి వచ్చే మినిరల్ వాటర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడ్ నీరే!
వేసవి వచ్చిందంటే జొహరాపురంలో చదువుకునే పిల్లలు నుంచి వయో వృద్ధు లు వరకు నీటి కోసం వెళ్లాల్సిందే.ఈ గ్రామ పరిసరాలు మొత్తం నల్లరేగడి భూములున్నాయి. దీంతో ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతోంది. బోర్లు, రిజర్వాయర్లు లేని కాలంలో దాహం తీర్చుకునేందుకు వందల ఏళ్ల క్రితం పెద్దలు వర్షపు నీరు వెళ్లే ప్రధాన కాలువ సమీపంలో ఒక్కిరేణి నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఒక్కిరేణి నీటినే గ్రా మస్తులు తాగుతున్నారంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థమవుతోంది. గ్రామంలో మంచి నీటి సమస్య ఉండటంతో దాదాపు వంద కుటుంబాలు భూములను కౌలుకిచ్చి కర్నూలు, బళ్లారి, ఆదోని పట్ణణాలకు వెళ్లి స్థిర పడ్డారు. ఇంకా చాలా మంది వేళ్లే ఆలోచనలో ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రతి ఇంటికీ సంపు
గ్రామంలో కొత్తగా నిర్మించుకునే ప్రతి ఇంటికి సంపు ఏర్పాటు చేసుకుంటున్నారు. మిద్దె పై నుంచి వచ్చే నీటిని పైపులు ద్వారా సంపును నింపుకుంటున్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్నా నీరు దొరక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క ట్యాంకర్ నీరు రూ.800 కొనుగోలు చేస్తున్నారు. ఇది అదనపు ఖర్చు అని బాధపడుతున్నారు. నీటి సమస్య ఉండడంతో గ్రామంలో శుభ కార్యాలు కూడా చేయక పట్టణాలలోని ఫంక్షన్ హల్‌లో చేసుకుంటున్నారు.
క‘న్నీటి’ కష్టాలు