చూపును హరించే ‘గ్లకోమా’ | - | Sakshi
Sakshi News home page

చూపును హరించే ‘గ్లకోమా’

Mar 9 2025 1:06 AM | Updated on Mar 9 2025 1:06 AM

చూపున

చూపును హరించే ‘గ్లకోమా’

జిల్లాలో అధికమవుతున్న కేసులు

నేటి నుంచి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు

కర్నూలు(హాస్పిటల్‌): కంటి అద్దాలను తరచూ మార్చాల్సి రావడం.. మసక వెలుతురులో వస్తువులను గుర్తించడం ఆలస్యం అవడం.. లైట్ల చుట్టూ రంగుల వలయాలు కనిపించడం.. ఇలా ఎన్నో లక్షణాలు గ్లకోమా వ్యాధిలో భాగంగా ఉంటాయి. ఈ వ్యాధికి ప్రాథమిక దశలో చికిత్స తీసుకుంటే చూపును కాపాడుకోవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం అంధకారమే మిగులుతుంది. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహించనున్నారు.

పెరుగుతున్న బాధితులు

కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల, నంద్యాల కంటి ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో కంటి సమస్యలకు చికిత్స చేస్తారు. గతంలో 2 శాతం వరకు గ్లకోమా బాధితులు ఉంటున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య పెరిగింది. ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ప్రతి రోజూ 250 నుంచి 300 మంది దాకా చికిత్స కోసం వస్తుండగా అందులో గ్లకోమా బాధితులు 5 నుంచి 10 మంది దాకా ఉంటున్నారు. గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వైద్యులు అవగాహన కల్పించనున్నారు.

చికిత్స ఇలా..

గ్లకోమాకు శాశ్వత చికిత్స లేదని, మందులతో వ్యాధిని అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొందరికి లేజర్‌ చికిత్స చేయవచ్చు. అలాగే శస్త్రచికిత్సతో చూపును కాపాడుకోవచ్చు. సాధారణ ఆంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా చికిత్సలో డాక్టర్‌ లేజర్‌ను ఉపయోగించి ద్రవం ప్రవహించడానికి మరో మార్గం తయారు చేస్తారు. కానీ బాగా ముదిరిన దశలో రోగికి మందులు, శస్త్రచికిత్సల అవసరం ఉంటుంది.

వారోత్సవాలు ఎక్కడంటే..

గ్లకోమాపై ఆదివారం అవగాహన వారోత్సవాల ప్రారంభం కార్యక్రమాన్ని కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్‌ ఎం. సంధ్యారెడ్డితో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 10వ తేదీన పడిగిరాయి పీహెచ్‌సీలో, 11న వాక్‌థాన్‌, 12న పోలకల్‌ పీహెచ్‌సీలో, 13న కర్నూలు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో, 14న హర్దగేరి పీహెచ్‌సీలో, 15న కంటి ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్లకోమా కు కంటి ఆసుపత్రిలో ప్రతిరోజూ ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో కంటి వైద్యులు డాక్టర్‌ సత్యనారాయణరెడ్డి, డాక్టర్‌ యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

చూపును హరించే ‘గ్లకోమా’ 1
1/1

చూపును హరించే ‘గ్లకోమా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement