కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది కూడా మద్దతు ధరతో కందులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వ రంగసంస్థ నాఫెడ్ మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇచ్చింది. 2023–24లో కందుల ధరలు పెరిగిపోవడంతో భవిష్యత్ అవసరాలు, ప్రజాపంపిణీ కోసం నాఫెడ్ బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా దాదాపు 10 వేల క్వింటాళ్ల కందులు సేకరించింది. ఇప్పటికి కందుల ధర దిగిరాలేదు. ఈ సారి కందిలో దిగుబడులు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడటంతో పూత మొత్తం రాలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో నెల రోజులకుపైగా వర్షాలు లేకపోవడం, నేలలో తేమ పడిపోవడంతో కంది పంట చివరి దశలో దెబ్బతినింది. దీంతో ది గుబడులు తగ్గిపోయాయి. కందులకు కనీస మద్దతు ధర రూ.7,550 ఉండగా... మార్కెట్‌లో రూ.10 వేల వరకు ధర ఉంటోంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్టా నాఫెడ్ బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా కందులు సేకరించనుంది. మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి ఎలాంటి నాణ్యత ప్రమాణా లు పాటిస్తారో... మార్కెట్ ధరతో కొనుగోలు చేయడానికి కూడా అవే నాణ్యత ప్రమాణాలను పాటిస్తారు. కంది సాగు చేసినట్లుగా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకొని ఈ–కేవైసీ చేయించి ఉండాలి. ఇటువంటి రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తారు. జిల్లాలో దాదాపు 75 వేల ఎకరాల్లో కంది సాగు అయింది.
మార్కెట్ ధర రూ.10 వేలపైనే