
డ్రిప్ పరికరం
● గతేడాది 4,509 హెక్టార్లకు
సూక్ష్మ సేద్యం
● ఈ ఏడాది 5 వేల హెక్టార్లకు
కల్పించే విధంగా లక్ష్యం
● బోరున్న ప్రతి రైతూ అర్హుడే
● ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్లు
● 90 శాతం సబ్సిడీతో బిందు సేద్యం
● 55 శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్లు
ఈ రైతుపేరు మధుశేఖర్. వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన ఈయన గతేడాదిస్ప్రింక్లర్ల సదుపాయం పొంది మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. పెట్టుబడి వ్యయం బాగా తగ్గి ఎకరాకు ఐదు టన్నుల దిగుబడి వచ్చింది. స్ప్రింక్లర్ల కింద సాగు చేయడం వల్ల ఖర్చులు పోను రూ.2,04,950 లభించింది. కాల్వల కింద సాగుతో పోలిస్తే.. స్ప్రింక్లర్ల కింద వేరుశనగ సాగు చేయడం వల్ల అదనంగా రూ.1,17,450 ఆదాయం వచ్చింది.
తోటలో బొప్పాయి కాయలను చూపిస్తున్న ఈ రైతు పేరు వై.సతీష్. పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామ వాసి. గతేడాది 3.5 ఎకరాల్లో బొప్పాయి మొక్కలు నాటుకున్నారు. డ్రిప్ సదుపాయం కల్పించుకున్నారు. దీంతో దిగుబడి 20 టన్నులు అదనంగా వచ్చింది. కాయ నాణ్యత బాగా ఉండటంతో టన్నుకు రూ.14,000 ధర లభించింది. మొత్తం రూ.14.70 లక్షల ఆదాయం వచ్చింది. పెట్టుబడి వ్యయం రూ.4,02,500 మినహాయిస్తే నికరంగా రూ.10,67,500 లాభం చేకూరింది.
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యంతో రైతులు అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. గతేడాది సూక్ష్మ సేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని రైతులకు 36.15 కోట్ల సబ్సిడీలు ఇచ్చింది. ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు రైతులు.. డ్రిప్, స్ప్రింక్లర్ల కోసం రైతుభరోసా కేంద్రాల్లో ముమ్మరంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అన్ని రకాల పండ్లు, పూల తోటలకు, మల్బరీ, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలకు బిందు సేద్యం కల్పించుకోవచ్చు. ఆకు కూరలు, వేరుశనగ, శనగ పంటలకు స్ప్రింక్లర్లు చాలా ఉపయోగపడతాయి. బోరు, విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతి రైతూ సూక్ష్మ సేద్యానికి అర్హులే.
గత ఏడాది 4,509 హెక్టార్లకు
సూక్ష్మ సేద్యం
గతేడాది 3700 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించాలనేది లక్ష్యం కాగా.. 4509.04 హెక్టార్లకు కల్పించారు. లక్ష్యానికి మించి 809 హెక్టార్లకు అదనంగా కల్పించడం విశేషం. డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.36.15 కోట్లు సబ్సిడీ భరించింది. జిల్లాలో 3507 మంది రైతులకు 3,332.57 హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించారు. మొత్తం విలు రూ.41.35 కోట్లు ఉండగా.. ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.34.48 కోట్లు భరించింది. అలాగే 1,077 మంది రైతులకు సంబంధించి 1,176.47 హెక్టార్లకు స్ప్రింక్లర్లు(తుంపర్లు) సదుపాయం కల్పించగా రూ.3.16 కోట్లు ఖర్చు వచ్చింది. ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.1.66 కోట్లు భరించింది.
ఈ ఏడాది లక్ష్యాలు ఇలా...
2023–24 సంవత్సరంలో ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి పెద్దపీట వేస్తోంది. ఈ ఏడాది 5,000 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించాలని లక్ష్యంగా ఇచ్చింది. గత ఏడాది సూక్ష్మ సేద్యం కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని మంజూరు కాని రైతుల వివరాలను 2023–24 సంవత్సరంలో బదలాయించారు. తాజాగా కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఐదు ఎకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం సబ్సిడీతో బిందు సేద్య సదుపాయం కల్పిస్తారు. స్ప్రింక్లర్లు తీసుకుని సన్న, చిన్న కారులకు 55 శాతం, 5 ఎకరాలు పైబడిన రైతులకు 45 శాతం సబ్సిడీ లభిస్తుంది. గత ఏడాది రైతులతో సహా 8138 మంది సూక్ష్మసేద్యం సదుపాయం కోసం ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
డ్రిప్ ఉపయోగాలు ఇలా...
బిందు సేద్యం ద్వారా పంటలను బట్టి 30–70 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. అన్ని మొక్కలకు సమానంగా నీరు సరఫరా అవుతుంది. అధిక మొలక శాతం, సమానమైన పంట పెరుగుదల ఉంటుంది. కలుపు సమస్యలు బాగా తగ్గుతాయి. నీటి ద్వారానే ఎరువుల సరఫరా చేస్తుండటం వల్ల పంట పెరుగుదలకు అను గుణంగా పోషకాల సరఫరా అవుతాయి. ఏక కాలంలో పంట కోతకు వస్తుంది. సూక్ష్మ సేద్యం ద్వారా కరెంటు 40 శాతం అదా అవుతుంది. కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గుతుంది. పంటలకు పురుగులు, చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. ఎత్తుపల్లాలు గల నేలలో కూడా సులభంగా నీరు పారించవచ్చు. నాణ్యమైన ఉత్పత్తి రావడంతోపాటు ఎకరాకు 20–30 శాతం వరకు దిగుబడి పెరుగుతుంది.


