
● రాయలసీమ విశ్వవిద్యాలయంలో
ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధ కోర్సు
● ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో
60 సీట్లకు అనుమతి
● కంప్యూటర్ సైన్స్ విభాగంలో
60 నుంచి 120 సీట్లకు పెంపు
కర్నూలు (న్యూసిటీ): విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే దిశగా రాయలసీమ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సును ప్రవేశపెట్టింది. ప్రతిభా వంతులైన విద్యార్థులు నామమాత్రపు ఫీజుతో ఈ కోర్సు చదివే అవకాశం కల్పిస్తోంది. కోర్సులో 60 సీట్లకు అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యామండలి నుంచి అనుమతి లభించింది. దీంతోపాటు కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రస్తుతమున్న 60 సీట్లను గాను 120 సీట్లు పెంచుకోవడానికి అనుమతి వచ్చిన్నట్లు సమాచారం. కృత్రిమ మేధ కోర్సు రాయలసీమ యూనివర్సిటీలో ప్రారంభిస్తుండడంతో విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందకు అవకాశం ఏర్పడనుంది.
ఇవీ ఉపయోగాలు..
కంప్యూటర్లు, రోబో లాంటి యంత్రాలు చేసే ప్రతి పనికి ప్రోగ్రామ్‌లు అవసరం. ఇలా ప్రోగ్రామ్‌ల అవసరం లేకుండానే పరిసరాల్లో మార్పులకు అనుగుణంగా ఆలోచించగలగడం, నేర్చుకోగలగడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండటాన్నే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటారు. ఫిన్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు గుండె జబ్బుల్ని డాక్టర్ల కంటే ముందుగానే కనిపెట్టే ఏఐని అభివృద్ధి చేశారు. హార్ట్‌బీట్‌ను అంచనావేస్తూ ఇది పనిచేస్తుంది. దీంతో భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాల్ని ముందుగానే గుర్తించి చెబుతుంది. మెయిల్స్, మెసేజ్‌లలో ముఖ్యమైనవాటిని గుర్తించి నోటిఫికేషన్లుగా చూపే యాప్స్ ఇలా ప్రతి విషయంలో ఏఐ కీలకంగా మారింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే?
సామాన్య ప్రజల జీవితాన్ని సులభతరం చేయడానికి ఏఐని ఉపయెగించవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తగ్గించడం, ప్రభుత్వ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐ ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో దీని వినియోగం విస్తరిస్తుంది. ఇప్పటికే ఫార్మా, కార్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీ, మొబైల్ కంపెనీలు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్లలో కూడా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
విద్యార్థుల భవిష్యతే ముఖ్యం
రాయలసీమ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ప్రవేశపెడుతున్నాం. అలాగే విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి స్పోకెన్ ఇంగ్లిషు, బ్యాంకింగ్‌పై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం, గ్రూపు 1,2 పోటీ పరీక్షలకు కూడా నిపుణులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుకు డిమాండ్ ఉండడంతో ఉపాధి అవకాశాలు అధికం. – ఆచార్య ఎ.ఆనందరావు
(ఉపకులపతి, రాయలసీమ విశ్వవిద్యాలయం)
