చల్లపల్లి: పాల వ్యాను అదుపు తప్పి పల్టీకొట్టిన ఘటన 216వ నంబరు జాతీయ రహదారిపై మండలంలోని రామానగరం వద్ద సోమవారం ఉదయం జరిగింది. వ్యానులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయ డెయిరీకి చెందిన పాల వ్యాను నాగాయలంక వరకు వెళ్లి మిల్క్ పాయింట్ల వద్ద లోడు దించి తిరుగు ప్రయాణమైంది. రామానగరం క్లబ్ రోడ్డుకు ముందు వ్యాను అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. జాతీయ రహదారిపై నుంచి మోపిదేవి మండలం కాసానగరం వద్ద సర్వీసు రోడ్డులోకి దిగి చల్లపల్లి వైపు రావాల్సిన వ్యాను తిన్నగా మచిలీపట్నం వైపు వెళ్లిపోయింది. కొత్త డ్రైవర్ డ్యూటీలోకి రావటం వల్ల రూటు మర్చిపోయి ముందుకు వెళ్లిపోయి ఉంటాడని చెబుతున్నారు.
11 నుంచి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు మే 11 నుంచి 13వ తేదీ వరకు కోనసీమ అంబేడ్కర్ జిల్లా అమలాపురంలో జరుగుతాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ కరపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 1934లో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన ఈ సంఘం ఐదు లక్షల సభ్యత్వాలు కలిగి ఉందన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, పేదల హక్కుల కోసం ఉపాధి హామీ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. 232 గ్రామాల్లో భూస్వాములు ఆక్రమించుకున్న వేలాది ఎకరాలు పేదల భూములను, ప్రభుత్వ భూములను తిరిగి పేదలకు ఇప్పించడంలో ప్రముఖపాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర 30వ మహాసభ అమలాపురంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మహాసభల్లో నూతన కమిటీ ఎన్నుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు శివ నాగరాణి, ఎ.రవి, కె.ఆంజనేయులు, కారం వెంకటేశ్వరావు, ఎం.పుల్లయ్య పాల్గొన్నారు.


