ఐసీఏఆర్ అటారి జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరా
ఘంటసాల: ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని మోడల్ కేవీకేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అటారి 10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా పేర్కొన్నారు. గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో 13వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ షేక్ మీరా మాట్లాడుతూ.. ఘంటసాల కేవీకే 13 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తూ రైతుల సేవలు అందిస్తూ, వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఏటా 620 క్వింటాళ్ల ఫౌండేషన్ వరి విత్తనాలు, 130 క్వింటాళ్ల నాణ్యమైన అపరాల విత్తనాలను రైతులకు అందించడంతో పాటు, 1.12 టన్నుల ట్రైకోడర్మా పంపిణీ చేస్తోందన్నారు. తద్వారా రైతు స్థాయిలో నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పించడమే కాకుండా కొత్త పంటలు, కొత్త వంగడాలు, కొత్త వైరెటీ యాజమాన్య పద్ధతులను ఈ ప్రాంత రైతులకు పరిచయం చేస్తూ వ్యవసాయాభి వృద్ధికి కేవీకే దోహదం చేస్తోందన్నారు. దేశంలో మొత్తం 731 కేవీకేలు ఉండగా, వాటిలో ఘంటసాలకు ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మోడల్‌గా తీర్చిద్దుతామన్నారు. కృష్ణా జిల్లాలో నేలల్లో సేంద్రీయ కార్బన్ శాతం తక్కువగా ఉందని, దీనిని పెంపొందించేందుకు సాయిల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వెయ్యి మంది రైతులను ఎంపిక చేసి సేంద్రీయతను పెంపొందించేందుకు దశ, దిశ మార్గదర్శకం చేస్తున్నామన్నారు. ఈ కేవీకేలో మొదటిసారిగా ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టి రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామన్నారు.
లాభసాటి సాగు విధానాలను చేరువ చేయాలి
ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు నూతన లాభసాటి సాగు విధానాలను చేరువ చేయాలని సూచించారు. ఘంటసాల కేవీకే రైతులకు ఉత్తమ సేవలు అందిస్తోందని కొనియాడారు. ముందుగా కేవీకే ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన పూలు, గుర్రపుడెక్క, మామిడి, జామ కాయలతో చేసిన వివిధ ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించారు. భూమి సుపోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా చేసిన మట్టి పరీక్షలను తనఖీ చేశారు. ఘంటసాల కేవీకేలో నూతనంగా నిర్మించిన విత్తన గిడ్డంగి, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్, ఇతర ల్యాబ్స్, తాగునీటి పంపును డైరెక్టర్ డాక్టర్ మీరా, ఎమ్మెల్యే బుద్ధ ప్రారంభించి, నూతన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ విస్తరణ డైరెక్టర్ డాక్టర్ జి.శివన్నారాయణ, కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి, ఏఆర్ ప్రతినిధులు పద్మా వతి, కాకి నాగేంద్రరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్. పద్మావతి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్‌సీహెచ్ నరసింహులు, కేవీకే శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పలువురు పాల్గొన్నారు.


