భవానీపురం(విజయవాడపశ్చిమ): మహిళలు సృజనాత్మకతతో రూపొందించిన హస్తకళ ఉత్పత్తులు వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల నైపుణ్యాలతో తయారు చేసిన హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు హస్తకళలపై శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్ర మాన్ని ఆయన పరిశీలించారు. ఫ్యాబ్రిక్, గ్లాస్ పెయింటింగ్, తాంజోర్ పెయింటింగ్స్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో దాదాపు వంద మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. హస్తకళా ఉత్పత్తులను తయారు చేయడంలో మహిళలు తమ సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చని సూచించారు. ఈ శిక్షణలో వివిధ ఉత్పత్తుల తయారీ పద్ధతులు, నూతన డిజైన్లు, మార్కెటింగ్ విధానాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. శిక్షణ అనంతరం మహిళలు రూపొందించిన తమ ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.ఎన్.వి. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


