చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా అభివృద్ధికి కలెక్టర్ డి.కె.బాలాజీ విశేష కృషి చేశారని పలువురు కొనియాడారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శనివారానికి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కేక్ కట్‌చేసి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్వో చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. కలెక్టర్ బాలాజీ జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన అందించారన్నారు. కట్టుదిట్టమైన పర్యవేక్షణతో ప్రభుత్వ పథకాల అమలు చేశారని వివరించారు. కలెక్టర్ చూపుతున్న అంకితభావం ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్‌జాహిద్, బందరు ఆర్డీఓ కె.సాంబశివరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ అఖిల, కలెక్టరేట్ ఏఓ ఎ.ఎస్.ఎన్.రాధిక, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


